త్రుటిలో తప్పించుకున్న నారా లోకేష్, సోమిరెడ్డి, అశోక్ గజపతి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కడియం మండలం వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తోంది. వర్ష భీభత్సానికి మహానాడు సభా ప్రాంగణం వద్ద కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. వర్షంలో తడుస్తూనే తమ నాయకుల ప్రసంగాలు విన్నారు. భారీ వర్షం, ఈదురు గాలులతో మహానాడు సభా ప్రాంగణం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. భారీ ఈదురు గాలులకు నాయకుల కటౌట్ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడి నేలకొరిగింది.
ఈదరు గాలులతో కటౌట్ పడిన టెంట్ లో అప్పటివరకు పార్టీ నేతలు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, పంచుమర్తి అనురాధ, బాలవీరాంజనేయులు తదితరులున్నారు. వీరంతా బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఎన్టీఆర్ కటౌట్ పడి వీఐపీ టెంట్ నేలకొరిగింది. వర్షంలోనూ నాయకులు తమ ప్రసంగాలను కొనసాగించారు. తడవకుండా కార్యకర్తలు తలపై కుర్చీలు అడ్డం పెట్టుకున్నారు.

మైదానంలో ఉన్న ఎల్‌ఈడీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ముందు జాగ్రత్తగా సిబ్బంది తరలించారు. రాజమహేంద్రవరం నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో చంద్రబాబునాయుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కొంత ఆలస్యంగా ఆయన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. వేమగిరి వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేల సంఖ్యలో కార్యకర్తలు బహిరంగ సభకు తరలి వచ్చారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుణ్ని మరోసారి ఎన్నుకున్నారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సమరమేనని, వైసీపీని ఓడించి పేదవాడిని ధనవంతుణ్ని చేస్తానని బాబు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అని, ఆ వాహనం ముందు చక్రం సంక్షేమానికి, వెనక చక్రం అభివృద్ధికి ప్రతీకలని, ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చిందని, దూసుకుపోవడమే తరువాయి అని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications