తొలగని ముప్పు, ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు- అతి భారీ వర్షాలు..!!
మొంథా తుఫాన్ పంజా విసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు, భారీవర్షాలతో బీభత్సం సృష్టించింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయ తాండవం చేసింది. తుఫాన్ తీరం దాటినా ఇంకా భారీ వర్షాల పైన వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది. పాఠశాలలకు 31వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. రైళ్లు రద్దు చేసారు. ఇటు, ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈ రోజు..రేపు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మొంథా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను తీరం దాటే సమయం లో కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. మొంథా' ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనుంది. తుపాను ప్రభావంతో గాలుల ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో గాలుల వేగం కొనసాగుతోంది.

మొంథా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. బీచ్ రోడ్డులో సీతకొండపై నుంచి బండరాళ్లు జారి పడ్డాయి. కృష్ణా జిల్లాలో మొంథా బీభత్సం సృష్టించింది. తీరప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. బలమైన గాలులధాటికి రహదారులపై వృక్షాలు విరిగి పడి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతంలో చాలావరకూ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడింది.
పెనుగాలులతో తీరప్రాంతాన్ని వణికించింది. నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, కాళ్ల మండలాల్లో భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కైకలూరు మండలంలో కొల్లేరు వరద ఉధృతి పెరిగింది. దీంతో.. ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అలర్ట్స్ తో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications