ఏపీకి భారీ వర్ష సూచన: ఈ జిల్లాల్లో ఉరుములతో..
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని దక్షిణ రాయలసీమ జిల్లాల వరకు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, కడప జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, .తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించింది.

కాగా- ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం వేళ సాయంత్రం పూట అకస్మాత్తుగా భారీ వర్షం పడింది. సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, బేగంబజార్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, గోషామహల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచింది.
వర్షం వల్ల వినాయక నిమజ్జనాలకు తరలి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.












Click it and Unblock the Notifications