కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన... ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం మరవకముందే మరో తుఫాను పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 22 తర్వాత కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 22,23 తేదీల నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం అది వాయుగుండంగా మారుతుందని, తద్వారా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో రాష్ట్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడుతోంది. అయితే సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపారు. శనివారం, ఆదివారంతో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెళ్లిపోతాయని... ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు.

ఏది ఏమైనప్పటికీ ఈ వార్త కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తిత్లీ తుఫానుతో సర్వం కోల్పోయామని మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే వార్త వినిపిస్తుండటంతో ఆందోళనగా ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications