రాయలసీమ ప్రాజెక్టులు ఫుల్: పింఛా గేట్ల ఎత్తివేత: పోటెత్తిన పాపాఘ్ని
కడప: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారుల అంచనాలకు అనుగుణంగా వర్షాలు ముంచెత్తుతోన్నాయి. రాయలసీమ జిల్లాలపై ద్రోణి ప్రభావం మరింత అధికంగా ఉంటోంది. కొన్ని గంటల పాటు కురిసిన భారీ వానలకు రాయలసీమలో గల నీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. నదులు ఉప్పొంగుతోన్నాయి. వరదనీటి కాల్వలు పొంగి ప్రవహిస్తోన్నాయి.

సీమ జిల్లాల్లో జలకళ
అనంతపురం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా కడప-అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని టీ సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద నిర్మించిన పింఛా ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించిన వరదనీరు వచ్చి చేరింది. పింఛానదిపై నిర్మించిన ప్రాజెక్టు ఇది. పెన్నాకు ఉపనది.. పింఛా. ఈ నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నది ఉప్పొంగింది. పింఛా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద నీరు మరింత వచ్చి చేరుతోండటంతో గేట్లను ఎత్తేశారు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు.

అత్యధికంగా అనంతపురం జిల్లాలో
కాగా అనంతపురం జిల్లాలోని తలుపుల, కదిరి, నల్లమాడ, గోరంట్ల, ఓబుళదేవర చెరువు పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. తలుపుల మండలంలో అత్యధికంగా 142.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి ఏకధాటిగా కురుసిన భారీ వర్షానికి కదిరి-పులివెందుల రహదారి దెబ్బతింది. ఈ మార్గంలో పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. కొన్ని చోట్ల రోడ్డు మార్గం కొట్టుకుపోయింది.

కదిరి-పులివెందుల రహదారిపై
తలుపుల మండలంలోని చిన్నపల్లి, మాడిక వాండ్లపల్లి చెరువులకు గండి పడింది. ఫలితంగా లోతట్టు గ్రామాల్లోకి వరదనీరు చేరింది. ఫలితంగా కొన్ని చోట్ల పంటపొలాల్లో వరద నీరు నిలిచింది. తలుపుల మండలంలోని చిన్నపల్లి చెరువుకు గండిపడింది. ఓదులపల్లి వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కదిరి-పులివెందుల ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే మార్గంలోని నామాలగుండు బ్రిడ్జి వద్ద వరదనీరు పోటెత్తుతోంది.

పింఛా, వెలిగల్లు ఫుల్..
అటు పింఛా పరీవాహక ప్రాంతాలైన నంబులపూలకుంట, చామలగొంది వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా- కదిరి రాయచోటి రహదారిపై వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. జమ్మలమడుగు, కమలాపురం, ఎర్రగుంట్ల, పోరుమామిళ్లలొ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కడప, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరులో తేలికపాటి వర్షం కురిసింది. ఎగువన కురిసిన వర్షంతొ వెలిగల్లు, పింఛా ప్రాజెక్టులకు భారీగా వచ్చి వరదనీరు చేరింది.
గేట్ల ఎత్తివేత..
పింఛా ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేశారు అధికారులు. అలాగే- వెలిగల్లు ప్రాజెక్టు నుంచి కూడా మూడు వేల క్యూసెక్కుల నీటిని పాపాఘ్ని నదికి విడుదల చేశారు. దీనితో గండి పుణ్యక్షేత్రం వద్ద పాపాఘ్ని నది పరవళ్లు తొక్కుతోంది. సమీపంలోని గొల్లపల్లి తండాలో వరదనీరు ప్రవహించింది. వీధులను ముంచెత్తింది. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. పులివెందుల సమీపంలోని ఎర్రబల్లి చెరువు గతంలో ఎప్పుడూ లేనిస్థాయిలో పొంగి పొర్లుతోంది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

ప్రాంతాలవారీగా..
నందిగామ-120, తుళ్లూరు-108, రాయచోటి-102, కదిరి-107, మంగళగిరి-105, ముదిగుబ్బ-87, గాలివీడు-71, పూతలపట్టు-65, తవణంవారి పల్లె-63 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీనితోపాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.

రుతుపవనాలు చురుగ్గా..
ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతం మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటం వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయని అధికారులు అంచనా వేస్తోన్నారు. శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక దక్షిణ ప్రాంతం, ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఉత్తరాంధ్ర సహా
ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఈ అర్ధరాత్రి తరువాత మరోసారి అతి భారీ వర్షాలు కురవడానికి అధిక అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. నెల్లూరు, ఒంగోలు, రాజమహేందరవరం, ఏలూరుల్లో ఈ సాయంత్రం నుంచి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు.
Recommended Video

శనివారం కూడా..
కాగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి బలహీనపడడంతో తెలంగాణలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications