సడన్ గా ప్రధాని రాజీనామా
బ్రిటన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికార లేబర్ పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్న నేపథ్యంలో పదవి నుంచి తప్పుకొంటోన్నట్లు వెల్లడించారు. దాదాపు రెండేళ్ల క్రితం ఘన విజయంతో అధికార పీఠాన్ని దక్కించుకున్న స్టార్మర్, ఇంత త్వరగా పదవి నుంచి తప్పుకోవాల్సి రావడం యూకేలో సంచలనంగా మారింది.
లేబర్ పార్టీలో అంతర్గతంగా పెరిగిన అసమ్మతి, నాయకత్వ మార్పు కోసం జరిగిన అంతర్గత తిరుగుబాటు స్టార్మర్ నిష్క్రమణకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ నుంచి స్టార్మర్‌కు సవాల్ ఎదురైంది. బ్రిటన్ రాజకీయ సంప్రదాయాల ప్రకారం ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలంటే సదరు నేత తప్పనిసరిగా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై ఉండాలి.

కిందటి వారం జరిగిన ఉప ఎన్నికల్లో బర్న్‌హామ్ ఘన విజయం సాధించారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. దీంతో కీర్ స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేయాలనే డిమాండ్లు లేబర్ పార్టీలో బలంగా వినిపించడం ఆరంభమైంది. ఒత్తిడి తీవ్రతరం కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఈ విషయాన్ని ప్రకటించారు స్టార్మర్. అక్కడే మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లే సామర్థ్యం తనకు ఉందో లేదో అని లేబర్ పార్టీ సభ్యులు ఆలోచిస్తున్నారని, ఆ ప్రశ్నకు వచ్చిన ప్రతికూల సమాధానాన్ని తాను గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా దేశ హితం కోసమేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications