హెల్మెట్ నుంచి ఏపీ ప్రజలకు ఊరట: నిబంధన తీసేశామన్న మంత్రి శిద్దా
అమరావతి: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన విషయంలో ఏపీ ప్రజలకు ఊరట లభించింది. హెల్మెట్ వాడకం తప్పనిసరేమీ కాదని, గడువును మరింతగా పొడిగించామని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఈ మేరకు వాహనదారులను అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రవాణాశాఖ, పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని ఆయన తెలిపారు. కాగా, ఈరోజు నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

హెల్మెట్ గురించి గత నెల రోజులుగా పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించారు. అయితే ప్రజల్లో ఎంత మేరక అవగాహన పెరిగిందో తెలుసుకునేందుకు ఈరోజు ఉదయం హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి నుంచి పోలీసులు జరిమానాలు వసూలు చేయడం ప్రారంభించారు.
అయితే ఈ వసూళ్లను ట్రాఫిక్ పోలీసులు తమ జేబుల్లోకి నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. మొదటి రోజున హెల్మెట్ పట్టుబడిన వారి నుంచి జరిమానాగా రూ. 100 వసూలు చేయగా, మరికొన్ని చోట్ల కొందరు అక్రమార్కులు జేబులు నింపుకున్నారన్న వార్తలు మీడియాలో వచ్చాయి.
దీనిపై స్పందించిన శిద్దా రాఘవరావు, సీఎం చంద్రబాబు నాయుడుతో సంప్రదించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications