ఈడీ స్వాధీనం చేసుకోబోయే జగన్ ఆస్తులు ఇవే..
ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో సాక్షి ప్రధాన కార్యాలయంతో పాటు, హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ ఉన్నాయి.
హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల్లో సాక్షి ప్రధాన కార్యాలయంతో పాటు, హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్ కూడా ఉన్నాయి.
కాగా, దీనికి సంబంధించి జగన్ కు నోటీసులు జారీ చేసిన ఈడీ ఆస్తుల స్వాధీనానికి సహకరించాల్సిందిగా కోరింది. ఇందుకోసం ఈడీ కేవలం 10రోజుల గడువు మాత్రమే ఇవ్వడం గమనార్హం. సాధారణ కేసుల్లో 40రోజుల పాటు గడువు ఇచ్చే ఈడీ.. అత్యంత తీవ్ర నేరాల విషయంలో మాత్రమే 10రోజుల గడువు ఇస్తుంది. దీంతో జగన్ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది.

జగన్ వర్గంలో ఆందోళన:
ఈడీ నోటీసులతో జగన్ శిబిరంలో కలవరం మొదలైంది. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలన్నా.. సోమవారం వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి. ఈలోగా ఇచ్చిన గడువులో నాలుగు రోజులు పూర్తయిపోయితాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఐదు రోజులు వృథా అయిపోయినట్టే.
దీంతో ఇక మిగిలేది 5రోజులే కాబట్టి.. ఈ ఐదు రోజుల్లో స్టే తెచ్చుకోవడం సాధ్యమవుతుందా? అన్నది అనుమానమే. స్టే రాకపోతే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రస్తుతం జగన్ వర్గం కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ హైకోర్టు చుక్కెదురైనా సుప్రీంను ఆశ్రయించవచ్చు. అయితే సమస్యల్లా ఈడీ ఇచ్చిన గడువుతోనే. ఈలోగా ఈడీ గనుక ఆస్తులు జప్తు చేస్తుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనలో జగన్ వర్గం ఉంది.

ఈడీ ఎదుట రెండు ఆప్షన్స్:
జగన్ ఆస్తుల స్వాధీనంకు సంబంధించి ఈడీ రెండు పద్దతుల్లో ముందుకెళ్లే అవకాశముంది. ఆస్తులను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని వాటి ఆదాయాన్ని తమ ఖాతాలో జమకట్టడం, లేదా ఆస్తులను స్వాధీనం చేసుకుని అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారి నుంచే అద్దె వసూలు చేయడం.
ఈడీ గనుక రెండో ఆప్షన్ ఎంచుకుంటే జగన్ కు పెద్దగా సమస్య ఉండదు గానీ మొదటి ఆప్షన్ కు పరిమితమైతే మాత్రం మరింత ఆందోళన తప్పదు.

ఈడీ దూకుడు:
జగన్ ఆస్తుల స్వాధీనంలో ఈడీ దూకుడు పెంచింది. గడిచిన వారం రోజుల్లో జగన్‌కు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. గుంటూరు జిల్లాలో సరస్వతీ పవర్ పేరుతో ఉన్న 900 ఎకరాలతోపాటు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో ఇల్లు జగన్ భార్య భారతి పేరిట ఉంది. తాజాగా సాక్షి ప్రధాన కార్యాలయంతో పాటు లోటస్ పాండ్ స్వాధీనానికి ఎన్ఫోర్స్ మెంట్ అడ్యూడికేటింగ్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. అథారిటీ ఆదేశాల మేరకు ఈడీ ఆస్తుల స్వాధీనానికి సిద్దమైంది.
అయితే దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు ఈడీ దూకుడుకు బ్రేక్ పడింది. ఇటీవలే స్టే ఎత్తివేయడంతో జగన్ ఆస్తుల స్వాధీనం కార్యక్రమాన్ని ఈడీ మళ్లీ వేగవంతం చేసింది.

స్వాధీనం చేసుకోబోయే ఆస్తుల జాబితా:
షలోమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పేరిట ఉన్న హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయం ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోబోతుంది. ఈ కంపెనీ హైదరాబాద్ రోడ్ నంబరు-1లోని నవీనగర్‌లో 2623 చదరపు గజాలతో ఒక ప్లాటును కొనుగోలు చేసింది.
సెల్లార్, సబ్ సెల్లార్‌తో సహా ఎనిమిది అంతస్తుల భవనాన్ని ఇందులో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో సాక్షి దినపత్రికతోపాటు సాక్షి టీవీ చానల్ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇదే భవనాన్ని ఆనుకుని మరో 1000గజాలను కంపెనీ కొనుగోలు చేసింది. ఇందులో సెల్లార్, సబ్ సెల్లార్ సహా నాలుగు అంతస్తులను నిర్మించారు.

వియ్యంకుల పేరిట స్థలాలు:
జగన్ తన వియ్యంకుల పేరుతో లోటస్ పాండ్ లో నెలకొల్పిన మూడు కంపెనీల పేరిట స్థలాన్ని కొనుగోలు చేసి భారీ నివాసాన్ని నిర్మించారు. హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరిట లోట్‌సపాండ్‌లో 5,807 చదరపు గజాల స్థలాన్ని 2008లో కొనుగోలు చేశారు.

ఇవి కూడా స్వాధీనం:
కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 7.85 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.
అలాగే సైబరాబాద్ లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ లో నివిష్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 9680 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. హైదరాబాద్ నగర శివారులోని మహేశ్వర మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో 32ఎకరాల 31గుంటల ఇన్ స్పైర్ హోటల్స్ కు చెందిన భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.












Click it and Unblock the Notifications