విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం
తాజాగా ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం రొడ్డ వలస సమీపంలో ఈ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘాట్ రోడ్డు గుండా ప్రయాణిసోన్నప్పుడు బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాప్తి చెందాయి.
సకాలంలో డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులందరినీ హెచ్చరించారు. వారు సురక్షితంగా బయటపడటంలో సహకరించారు. ఈ తెల్లవారు జామున సుమారు 35 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఒడిశా ఆర్టీసీ బస్సు అది. జయపుర్ కు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. రొడ్డవలస వద్ద ఘాట్ రోడ్డు ఎక్కుతున్నప్పుడు ఇంజిన్ ఒత్తిడికి గురైంది. తొలుత పొగ వెలువడింది. దీంతో డ్రైవర్ అలర్ట్ అయ్యారు. ప్రయాణికులను కిందికి దించారు.

మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్- మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ వేగంగా ఢీకొట్టింది.
అంతకుముందు- కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి బస్సు మంటలబారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది సజీవదహనం అయ్యారు. రోడ్డుపై బైక్ ను ఢీకొట్టడంతో రాపిడి చెలరేగి మంటలు అంటుకున్నాయి. బస్సు మొత్తం దగ్ధమైంది. బూడిద మిగిలింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆపరేటర్లపై ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేపట్టడానికి కారణమైంది. పలువురు ఆపరేటర్లపై కేసులు సైతం నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications