కర్నూలులో బెంచ్ ఏర్పాటు పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!!
కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. బెంచ్ ఏర్పాటు సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు న్యాయమూర్తులతో కమిటీ వేశామని పేర్కొంది. ఆ కమిటీ నిర్ణయం వెల్లడించే వరకు వేచిచూడాలని హైకోర్టు స్పష్టంచేసింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వంలో కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఈ మేర కు హైకోర్టుకు లేఖ రాసింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల పై జిల్లా కలెక్టర్ సైతం ప్రతిపాదనలు సిద్దం చేసారు. కాగా, హైకోర్టులో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు తాండవ యోగేశ్, తురగా సాయిసూర్య వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

కమిటీ నివేదిక
కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు న్యాయమూర్తు లతో కమిటీ వేశామని గుర్తు చేసింది. అది నిర్ణయం వెల్లడించే వరకు వేచిచూడాలని హైకోర్టు స్పష్టంచేసింది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు కదా అని వ్యాఖ్యానించింది. ఆ నివేదికను ఫుల్ కోర్టు ముందుపెట్టి బెంచ్ ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వస్తామని వెల్లడించింది. గుంటూరులో హైకోర్టు బెంచ్ కోసం 1993లో న్యాయవాదులు 103 రోజులపాటు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేసిన పిటీషన్..ఆ సమయంలో బెంచ్ ఏర్పాటును అప్పటి సీజే తిరస్కరించారని కోర్టుకు వివరించారు.
తుది నిర్ణయం కాదు
ఏపీ న్యాయశాఖ కార్యదర్శి గతేడాది అక్టోబరు 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారని వివరించారు. ఈ లేఖను పరిశీలిస్తే బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి, కార్యదర్శి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని.. ఇది న్యాయవ్యవస్థ అధికారంలో జోక్యం చేసుకోవడ మేనని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రి, న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందో, లేదో అధ్యయనం చేస్తామని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నివేదిక తెప్పించుకున్నామని పేర్కొంది. బెంచ్ ఏర్పాటు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications