ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు బెయిల్- సంగం డెయిరీ కేసులో తీర్పు- షరతులివే
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న నరేంద్రకు హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు ఎట్టకేలకు విముక్తి లభించినట్లయింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
సంగం డెయిరీ అక్రమాల కేసులో గత నెల 23న ఛైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణన్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మధ్యలో ఏసీబీ కస్టడీ విచారణతో పాటు పలు జైళ్లకు కూడా తిప్పారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఏసీబీ అధికారులు మాత్రం ఆస్పత్రి నుంచి జైలుకు కూడా తరలించారు. దీనిపై గతంలోనే ఏసీబీ కోర్టు సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.

తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర ఆరోగ్య పరిస్ధితిని, విచారణలో అంశాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌కు కొన్ని షరతులు విధించింది. ఆయన నాలుగు వారాల పాటు విజయవాడలోనే ఉండాలని సూచించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చని ధూళిపాళ్లకు సూచించింది. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. సంగం డెయిరీ కేసులో విచారణ మాత్రం కొనసాగనుంది.












Click it and Unblock the Notifications