తునిలో మళ్లీ హైటెన్షన్.. సై అంటే సై అంటున్న వైసీపీ, టీడీపీ
కాకినాడ జిల్లా తునిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ,టీడీపీ సై అంటే సై అంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక వాయిదా పడగా, ఇవాళ నాలుగోసారి ఎన్నికకు సిద్ధమయ్యారు అధికారులు. ఎన్నిక నేపథ్యంలో అక్కడికి చేరుకున్న వైకాపా కౌన్సిలర్లను తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వారు వెనుదిరిగి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంటికి వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లేదని.. వైసీపీ కౌన్సిలర్లలో ఎక్కువ మంది తమకే మద్దతిస్తారని చెబుతున్నారు.

ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ మరోవైపు వైసీపీ నేత దాడిశెట్టి రాజా 'చలో తుని'కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని హెచ్చరించారు. తుని మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163 (2) అమలు చేస్తున్నారు. సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఈ క్రమంలోనే దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంట్లో ఉన్నాడన్న సమాచారంతో.. స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు పోలీసులు. అనుచరులతో కారులో తుని వెళ్తున్న వైకాపా నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీతను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అలానే జక్కంపూడి గణేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. తుని బయల్దేరేందుకు సిద్ధమైన ఆయన్ని రాజమండ్రిలోనే అడ్డుకున్నారు. లాఠీఛార్జ్‌లు, తోపులాటలతో పరిస్థితి గందరగోళంగా మారింది. తుని మున్సిపల్ కార్యాలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications