శ్రీకాకుళంలో దారుణం: ప్రయాణికుడ్ని కదులుతున్న రైల్లోంచి తోసేసిన హిజ్రాలు
అమరావతి: రైళ్లలో హిజ్రాల వేధింపులు నానాటికీ మితిమీరుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ రైల్వేస్టేషన్ వద్ద దారుణం చోటు చేసుకుంది. అడిగిన మొత్తం ఇవ్వలేదని ఓ యువకుడిని కదులుతున్న రైలులో నుంచి హిజ్రాలు తోసేశారు.
మంగళూరు నుంచి సత్రగచ్చి వెళ్తున్న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని అక్కసుతో రైళ్లో భిక్షాటనకు వచ్చిన కొందరు హిజ్రాలు ఓ ప్రయాణికుడిని రైల్లో నుంచి తోసేశారు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని ఒడిశాలోని నయాగఢ్ జిల్లా డడమోల్ వాసి పూర్ణచంద్రసాహుగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీకి పదోతరగతి విద్యార్థి ఫిర్యాదు
గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీకి ఓ పదోతరగతి విద్యార్ధి తనపై కొందరు ఇంజనీరింగ్ విద్యార్ధులు తనపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు. నగరంలోని శ్యామలానగర్ పాఠశాలకు చెందిన తనపై ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ దాడిలో తన కంటికి గాయమైందని పేర్కొన్నాడు.
ఈ ఘటన ఈనెల 13న జరిగింది. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం గుంటూరు అర్బన్ పీఎస్‌లో పిర్యాదు చేశారు. విద్యార్థి కంటికి గాయం కావడంతో తల్లిదండ్రులు ముందుగా స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా హైదరాబాద్ తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు.
దాంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చూపించగా కంటికి చూపు వచ్చే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్పడంతో తిరిగి గుంటూరు వచ్చిన బాధిత తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు.
కర్నూలులో వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహరివి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన ప్రభావతి(20)కి నాలుగు నెలల కిందట సుందర్‌రాజు(25)తో వివాహమైంది.
గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ప్రభావతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications