బాలయ్య పీఏపై పోరాటానికి పిలుపు:హిందూపురం నేతలకు బెదిరింపులు!
ఎమ్మెల్యే బాలయ్య పీఏ శేఖర్ ను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.
హిందూపురం: హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఈమధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు పీఎ చంద్రశేఖర్. ఎమ్మెల్యే బాలయ్య పీఏగా అందరికీ సుపరిచితుడైన ఈ పీఏ గారి ఆగడాలు హెచ్చుమీరడంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో అసమ్మతి ఎంతలా రాజుకుందో అందరికీ తెలిసిందే.
జిల్లా నేతల అసమ్మతి ఎఫెక్ట్ తో ఎమ్మెల్యే బాలయ్య ఏకంగా పీఏనే మార్చివేస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయినా సరే పీఏ శేఖర్ మాత్రం స్థానిక నేతలపై తన జులుం ప్రదర్శిస్తున్నాడనే వాదనలు విపిస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ల ద్వారా పలువురు నేతలపై పీఏ శేఖర్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా స్థానిక టీడీపీ నేతలే వెల్లడించారు.

ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి పలువురు టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కొంతమంది కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు బాలయ్య అభిమానులు, మరికొంతమంది నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు తమ సమస్యల గురించి ప్రస్తావించారు. పేరుకే అధికార పార్టీ నేతలమైనా తమ పనులేవి జరగడం లేదని వాపోయారు. అందరం కలిసికట్టుగా దీనిపై పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బాలయ్య పీఏ శేఖర్ ను నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.
శేఖర్ ఫోన్ బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పీఏ శేఖర్ అంశంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు చర్చించారు. తామంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమేనని, పీఏ శేఖర్ వ్యవహారంపైనే తమ పోరాటమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications