చంద్రబాబు దిగ్భ్రాంతి: గూడ్స్ రైలు వల్ల మరింత పెను ప్రమాదం తప్పింది
ఏపీలోని విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విజయనగరం: ఏపీలోని విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పరిహారం ప్రకటించిన సురేష్ ప్రభు
ప్రమాదంపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు సురేష్ ప్రభు ప్రకటించారు. అలాగే, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50వేలు, కొంచం గాయపడ్డ వారికి రూ.25 వేల పరిహారం ప్రకటించారు.
కాగా, ప్రమాదం వల్ల ధనబాద్ - అలెప్పీ, హతియా - యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించారు.
గూడ్సు రైలు వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది
జగదల్పూర్ నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో తూర్పు కేబిన్ వద్ద పట్టాలు తప్పింది. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో పట్టాలపై గూడ్సు రైలు ఆగిఉంది.
ప్రమాదం జరిగిన హిరాకుండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా గూడ్సు రైలు పైన ఒరిగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అధికారులు, ప్రయాణికులు చెబుతున్నారు.
పట్టాలు తప్పిన ఏడు బోగీల్లో ఎస్9 తీవ్రంగా దెబ్బతింది. జనరల్, ఎస్9 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రమాద స్థలానికి విజయనగరం జిల్లా, ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications