ఇరుకు సందుల్లో.. ఇదేం ఖర్మ జనానికి
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. జిల్లాలోని కందుకూరులో ఆయన నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన ఘటన పట్ల తెలుగుదేశం పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన సహా అన్ని పార్టీలు దీనిపై స్పందించాయి.

తొక్కిసలాటలో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. ఆందోళనలో భాగంగా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట సంభవించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వాహనంపై నుంచి ప్రసంగిస్తోన్న సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరుకైన ప్రదేశం కావడం, పక్కనే మురుగునీటి పారుదల కాలువ ఉండటం వల్ల వంటివి ప్రమాదానికి దారి తీశాయి.

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా..
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున వైఎస్ జగన్ రెండు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

హోం మంత్రి విమర్శలు..
ఈ ఘటన పట్ల తాజాగా హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొంటోన్న చంద్రబాబుకు చంద్రబాబు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ పెట్టకూడదనే విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇరకు సందుల్లో.. ఇదేం ఖర్మ ప్రజలకు అంటూ మండిపడ్డారు.

ఇరుకు సందుల్లోనా..
తన రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవడానికి ఇలాంటి ఇరుకు సందుల్లో బహిరంగ సభలు, రోడ్ షోలను చంద్రబాబు నిర్వహిస్తోన్నారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో కూడా పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు 29 మంది ప్రాణాలను బలితీసుకున్నారని తానేటి వనిత గుర్తు చేశారు. చంద్రబాబుకు ఇదేమి పబ్లిసిటీ పిచ్చి అంటూ ప్రజలందరూ చెప్పుకొంటోన్నారని పేర్కొన్నారు.

ప్రజలను బాధపెట్టడానికే..
గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుంటే ఇక్కడే ఉండాలని, తాను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏమిటని తానేటి వనిత నిలదీశారు. వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అందుకే వారిని బాధపెట్టడానికే చంద్రబాబు ఇలాంటి రోడ్ షోలను చేపడుతున్నారని విమర్శించారు. కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications