అప్పుడే దంచికొడుతున్న ఎండలు, ఏపీలో 11 దాటితే !
మార్చి నెలలోనే భానుడు భగభగమంటున్నాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ప్రజలలో ఆందోళన కనిపిస్తుంది. జనవరి చివరి వారి నుంచే మొదలైన ఎండలు మార్చి రెండోవారానికి మరింత పీక్స్ కు చేరుకున్నాయి. ఇప్పుడే 40 డిగ్రీలు దాటి ఎండ తీవ్రత పెరుగుతుంది అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.
పెరుగుతున్న ఎండ తీవ్రత
వేసవి తొలి రోజులలోనే రాష్ట్రంలో ఎండలు తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుంది. ప్రజలు రోడ్లమీదకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మండలాలలో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

42 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అంతేకాదు అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిమ్మాయపాలెం లోను 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండవ వారానికి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.
ఎండల తీవ్రతకు అదే కారణం
ఇక ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాలలో కూడా ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. అయితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం అందుకు కారణమని చెబుతున్నారు.
ఎండల దెబ్బకు జనంలో ఆందోళన
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండి పెద్దగా ఉక్కపోత అనిపించడం లేదు కానీ ఎండ తీవ్రత మాత్రం బాగానే ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండుతున్న ఎండలతో జనం మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications