పండుగ వేళ పేదలకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. త్వరలో వారికి ఇళ్లస్థలాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నిజం చేసే పనిలో ఉంది, ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్, రూరల్ క్రింద ఇళ్ళ నిర్మాణాలను స్పీడప్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని పేదలకు మరో శుభవార్త అందించింది ఏపీ సర్కార్.
రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా లబ్ధిదారులు సొంత స్థలంపై ఇల్లు నిర్మించుకునే అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాలలోనూ, పట్టణ ప్రాంతాలలోనూ ఈ మేరకు ఇంటి స్థలం ఇవ్వటానికి రంగం సిద్ధం చేసింది.

నిరుపేదలకు ఇళ్ళ స్థలాలను ఇవ్వటం కోసం నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంది.మొత్తం రూ.1800 కోట్లతో పేదల ఇళ్ళ స్థలాల కోసం భూ సేకరణ చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్, నవంబర్ నెలలో ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తోంది.
ఈ ఇళ్ళ పట్టాలు ప్రధానంగా మహిళల పేరిట జారీ చేస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, ఇంతకు ముందు ఇల్లు లేదా స్థలం లేని కుటుంబాలే ఈ ఇళ్ళ స్థలాలను పొందటానికి అర్హులు. ఈ ఇళ్ళ స్థలాల పంపిణీలో వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పట్టాలు పొందిన తర్వాత లబ్ధిదారులు నిర్దేశిత కాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం అందుబాటులో ఉన్న హౌసింగ్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ఇంటి నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు శాశ్వత నివాసం కల్పించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇళ్ళ స్థలాలు కావాలనుకునే అర్హులైనవారు సంబంధిత మండల, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాల పంపిణీ కార్యక్రమాలు జిల్లాల వారీగా నిర్వహించనున్నారు. ఇల్లు లేని వారికి ఇది నిజంగా తీపికబురు, ఇది వారికి ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.













Click it and Unblock the Notifications
