బెజవాడలో కేశినేని బ్రదర్స్ రచ్చ ! టీడీపీకి భారీ నష్టం- వైసీపీకి మళ్లీ ప్రయోజనం ? ఎక్కడెక్కడ ఎలా ?
ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. దిగ్గజాలైన నేతలు లేకపోయినా, రాష్ట్ర భవిష్యత్తును శాసించే రాజకీయాలు జరగకపోయినా ఇక్కడి రాజకీయం ప్రభావం పలు ప్రాంతాలు, నేతలపై ఉండే అవకాశం ఉండటంతో వీటికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో గ్రూపు తగాదాలతో వైసీపీకి ఈ ప్రాంతంలో అధికారం అప్పగించిన టీడీపీ.. మరోసారి అదే ఫీట్ రిపీట్ చేసేలా ఉంది. దీనికి కేంద్రబిందువు మాత్రం విజయవాడలో కేశినేని బ్రదర్స్ పోరే. దీంతో లాభపడుతుంది, నష్టపోతోందీ వీరే..

కేశినేని బ్రదర్స్ పోరు
విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య పోరు రోజురోజుకూ పరాకాష్టకు చేరుతోంది. గతంలో కేశినేని ట్రావెల్స్ నడిపే విషయంలో తాను ప్రోత్సహించిన ఆరెంజ్ ట్రావెల్స్ నుంచి ఎదురైన పోటీ అధినేత కేశినేని నానిని ముంచేసింది. దీంతో సొంత ప్రభుత్వంలో ఏమీ చేయలేక ట్రావెల్స్ వ్యాపారానికి నాని గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రాజకీయం విషయంలోనూ ఆయనకు అదే పరిస్దితి ఎదురవుతోంది. విజయవాడ ఎంపీగా కేవలం 4 వేల ఓట్లలో గెలిచి ఊపిరిపీల్చుకున్నఆయనకు.. ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా సొంత సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఆయనకు గట్టి సవాల్ విసురుతోంది. గతంలో నానికి అండగా నిలిచిన చిన్ని ఈసారి మాత్రం నానితో విభేదించి వేరు కుంపటి పెట్టుకోవడమే కాకుండా విజయవాడ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క సమీకరణం జిల్లాలోని పలు సీట్లలో టీడీపీ సమీకరణాల్ని మార్చేస్తోంది.

నాని ప్రత్యర్ధులకు చిన్ని రెడ్ కార్పెట్
ఈసారి విజయవాడ ఎంపీగా ఎన్నికైన తర్వాత కేశినేని నానికి ఇంటిపోరు పెరిగింది. ఈ క్రమంలో ప్రత్యర్ధులూ పెరిగారు. టీడీపీలో కేశినేని బ్రదర్స్ మధ్య పోరు రాకముందు కేశినేని నానికి దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, బోండా ఉమ వంటి వారితో పోరు కొనసాగేది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అయితే కాస్త రూపు మార్చుకుంది. గతంలో కేశినేని నాని వర్సెస్ ప్రత్యర్ధులుగా సాగిన పోరు ఇప్పుడు కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్నిగా మారిన తరుణంలో వీరందరినీ చిన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో టీడీపీలోనే కేశినేని నాని ప్రత్యర్ధులకు చిన్ని రెడ్ కార్పెట్ వేస్తున్నారు.
చిన్ని అండతో నానికి ప్రత్యర్ధిగా ఉన్న బుద్ధా వెంకన్న వంటి వారు విజయవాడ పశ్చిమ సీటులో పోటీకి సై అంటున్నారు. అక్కడ నాని మద్దతిస్తున్న జలీల్ ఖాన్ కుటుంబాన్ని కాదని తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంటోంది. ఇది సహజంగానే కేశినేని నానిని చికాకు పెడుతోంది. తనకు వ్యతిరేకంగా చిన్ని కదుపుతున్న పావులు నానికి నానాటికీ ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. దీంతో ఆయన బహిరంగంగానే దీనిపై విమర్శలకు దిగుతున్నారు.

చిన్నిపై పోరులో వైసీపీ నేతలకూ నాని పెద్దపీట
సోదరుడు కేశినేని నానికి వ్యతిరేకంగా చిన్ని రంగంలోకి దిగిన తర్వాత టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోవడం మొదలైంది. ముఖ్యంగా టీడీపీలో ఇన్నాళ్లు తనకు ప్రత్యర్ధులుగా ఉన్న వారిని అక్కునచేర్చుకోవడం ద్వారా చిన్ని పెడుతున్న చికాకుతో నాని కూడా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చిన్ని గూటిలో లేని వారు, సొంత తనకు అండగా ఉంటున్న వారితో పాటు ప్రత్యర్ధి పార్టీ వైసీపీలోనూ తనకు సన్నిహితులైన వసంత ఫ్యామిలీ వంటి వారికీ నాని పెద్దపీట వేస్తున్నారు. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి మార్పు ప్రచారం వెనుక కూడా నాని తన ప్రత్యర్ధి దేవినేని ఉమకు వ్యతిరేకంగా ఆయనకు ఇస్తున్న మద్దతే కారణం. టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్ని కాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గం మైలవరంలో ఎంపీ నిధులు ఖర్చుపెట్టేవరకూ నాని వెళ్లడాన్ని బట్టి చూస్తే ఏం జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి ప్రయోజనం ?
గతంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్ని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేసిన వైసీపీకి మరోసారి అలాంటి పరిస్దితి వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. కేశినేని బ్రదర్స్ పోరుతో మారుతున్న సమీకరణాలే అందుకు కారణం. కేశినేని నాని, చిన్ని తమ అనుయాయలకు, సన్నిహితులకు పార్టీలతో సంబంధం లేకుండా పెద్దపీట వేయడం, అలాగ ప్రత్యర్ధుల్ని కుంగదీసే యత్నాలు చేస్తుండటంతో ఇది అంతిమంగా ప్రత్యర్ది పార్టీ వైసీపీకి ప్రయోజనం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క మైలవరంలో కాస్త భిన్నమైన పరిస్ధితి ఉండొచ్చేమో కానీ ఇతర చోట్ల మాత్రం కేశినేని బ్రదర్స్ వర్గాలుగా విడిపోతున్న టీడీపీ నేతలు భవిష్యత్తులో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడం అటుంచి పరువు కాపాడుకోవడం కూడా కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications