ఏపీ సచివాలయాల్లో భారీగా నమోదవుతున్న రిజిస్ట్రేషన్లు
Adudam Andhra: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన మరో కొత్త కార్యక్రమం- ఆడుదాం ఆంధ్రా (Adudam Andhra). గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి తలపెట్టిన వినూత్న కార్యక్రమం ఇది.
రాష్ట్ర క్రీడా చరిత్రలో భారీ స్థాయిలో చేపట్టిన కార్యక్రమం ఇది. 15 సంవత్సరాల వయస్సు పైన ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది జగన్ ప్రభుత్వం. యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను కూడా నిర్వహించనుంది.

తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50 లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు.
175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉంటుంది. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందించారు.
గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20 లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు.
ఆడుదాం-ఆంధ్రా క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ ఇదివరకే ప్రారంభించింది. డిసెంబరు 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు పురుషులు గానీ మహిళలు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్‌లైన్‌లో aadudamandhra.ap.gov. in వెబ్‌సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకునే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications