టీడీపీకి తొలి ఘోర పరాజయం: క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది.
సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కిందటి నెల 12వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ లోపే- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదుర్కొనాల్సి వచ్చింది కూటమి సర్కార్‌కు.

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆరుకు ఆరు స్థానాలనూ గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీతో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవచ్చంటూ చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో- వైఎస్ఆర్సీపీకి చెందిన నిర్మల కుమార్- రెండో డివిజన్, భీమిశెట్టి ప్రవళ్లిక- మూడో డివిజన్, బాపటి కోటిరెడ్డి- 33వ డివిజన్, మహ్మద్ ఇర్ఫాన్- 41వ డివిజన్, వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, ఈసరాపు దేవి- 57వ డివిజన్ విజయం సాధించారు. వీరిలో ఈసరాపు దేవి, నిర్మల కుమార్, భీమిశెట్టి ప్రవళ్లికు 47 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, మహ్మద్ ఇర్ఫాన్‌కు 45 చొప్పున, బాపటి కోటిరెడ్డికి 46 ఓట్లు పడ్డాయి.
గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్..డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. వీఎంసీలో 49 మంది సభ్యుల బలం ఉంది వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి 13, బీజేపీ, సీపీఎంలకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. కేశినేని శ్వేత రాజీనామా చేయడం వల్ల ఒక డివిజన్ ఖాళీగా ఉంది.












Click it and Unblock the Notifications