హైదరాబాద్ వచ్చి టీకి ఏపీవాసులు రూ.కోట్లిస్తున్నారు!
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండటం తెలంగాణ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు తెచ్చిపెడుతుండగా.. అంతే మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతోందట. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండే ఏపీ పాలన సాగుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, అధికారులు, మంత్రులు అందరు హైదరాబాదులోనే ఉంటున్నారు.
దీంతో మంత్రులను, అధికారులను, ఎమ్మెల్యేలను కలిసేందుకు పలువురు ఏపీ నుండి హైదరాబాదుకు వస్తున్నారు. ఇలా కలవడానికి వచ్చే వారి సంఖ్య పెద్ద మొత్తంలో ఉండటంతో.. వారి నుండి తెలంగాణకు వందల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వస్తున్నాయట. ఓ అంచనా ప్రకారం దాదాపు ప్రతి రోజు వందలాది వాహనాలలో వేలాది మంది హైదరాబాదుకు ఏపీ నుండి వస్తున్నారు.

ప్రయాణం, ట్యాక్స్‌లు, హైదరాబాదులో ఉండటానికి ఖర్చులు, ఇక్కడ వారు కొంటున్న ప్రతి వస్తువు పైన వ్యాట్.. ఇలా మొత్తంగా చూస్తే ఏపీ వాసులు తెలంగాణలో పెట్టే ఖర్చు నెలకు వందల కోట్ల రూపాయలలో ఉంటుందట. తద్వారా ఉమ్మడి రాజధాని ఏపీకే భారమని అంటున్నారు. దీంతో పాటు, పరిపాలనా సౌలభ్యం తదితర ఆలోచనలతో నేతలు కూడా త్వరగా ఏపీకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వాధికారులు దాదాపు నాలుగు వేలమంది హైదరాబాదులో ఉంటారని అంచనా. ఏపీకి కేటాయించిన వెయ్యి మంది వరకు ఏఐఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హెచ్ఆర్ఏ కింద ఉద్యోగులకు హైదరాబాదులో ముప్పై శాతం వరకు ఉండగా.. అదే విజయవాడ, గుంటూరులలో ఇరవై శాతం మాత్రమే ఉందట. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వం పదిశాతం ఎక్కువగా ఇచ్చినట్లు అవుతోంది.
జీహెచ్ఎంసీ కూడా ఏపీ ఉద్యోగుల నుండి ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో అదనంగా లాభం పొందుతోంది. గతంలో ప్రొఫెషనల్ ట్యాక్స్ కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌కు చెల్లించేవారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి దీనిని జీహెచ్ఎంసీకి ఇచ్చే విధంగా ట్రాన్సుఫర్ చేశారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో జీహెచ్ఎంసీకి దాదాపు మూడువందల కోట్ల రూపాయల మేర వస్తున్నాయట.












Click it and Unblock the Notifications