జగన్ -విజయమ్మ ఆస్తుల కేసులో ట్విస్ట్..! కంపెనీ లా ట్రైబ్యునల్ కీలక నిర్ణయం..!
ఏపీలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం గతంలో హైదరాబాద్ లోని కంపెనీల లా ట్రైబ్యునల్ కు చేరింది. గుంటూరు జిల్లాలోని సరస్వతీ పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాలు తమకు మద్దతుగా వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది.
వైఎస్ జగన్, భారతీ దంపతులు గతంలో వైఎస్ షర్మిలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు సరస్వతీ పవర్ లో తమకు ఉన్న వాటాల్లో కొన్నింటిని తల్లి విజయమ్మకు అప్పగించారు. దీంతో వాటాల బదలాయింపు పూర్తయింది. అయితే కొన్నేళ్లుగా షర్మిలతో విభేదాలు తలెత్తడంతో ఆ వాటాల్ని అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపిస్తూ జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసులతో లింక్ ఉన్న ఈ వాటాల్ని కోర్టు తీర్పులు రాకముందే బదిలీ చేసుకోవడం అక్రమం అని ఆరోపించారు.

దీనికి విజయమ్మ తరఫు న్యాయవాదులు ఓసారి వాటాల బదలాయింపు జరిగాక తిరిగి వాటిని తీసుకోవాలంటే ఇరువైపులా అంగీకారం అవసరమని ట్రైబ్యునల్ లో వాదించారు. ఓసారి జగన్ దంపతులు ఈ వాటాలు తల్లికి బదలాయించాక తిరిగి కోరే హక్కు లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో జగన్ కుట్ర పూరితంగా వాటాలు తిరిగి అడుగుతున్నారంటూ విజయమ్మ తరఫు లాయర్లు వాదించారు. దీంతో ఇరువైపులా వాదనలు విన్న ట్రైబ్యునల్ తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ తీర్పు ఎప్పుడు ప్రకటిస్తుందో మాత్రం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీఎల్టీ ఇచ్చే తీర్పు ఇరు వర్గాలకూ కీలకంగా మారబోతోంది.

జగన్ - షర్మిల మధ్య ఆస్తుల వివాదం నేపథ్యంలో ఎన్సీఎల్టీలో ఈ పిటిషన్ దాఖలు కావడం, అనంతరం తల్లి విజయమ్మ షర్మిల వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాల మధ్య ట్రైబ్యునల్ తీర్పు కీలకంగా మారింది. ఇప్పటికే తనకు గిఫ్ట్ గా ఇచ్చిన వాటాలు తిరిగి ఇచ్చేందుకు విజయమ్మ అంగీకరించని నేపథ్యంలో ఈ తీర్పు జగన్ కూ కీలకంగా మారింది. ఇందులో విజయమ్మ ఓడిపోతే మాత్రం షర్మిలకు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది.












Click it and Unblock the Notifications