అవాస్తవం.. తెరాసలోకి వెళ్లే ఆలోచన లేదు: జయసుధ
హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నాననే ప్రచారం అవాస్తవమని ప్రముఖ టాలీవుడ్ నటి, సికింద్రాబాద్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు జయసుధ ఆదివారం అన్నారు. తనకు తెరాసలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. జయసుద కాంగ్రెసు పార్టీ నుండి తెరాసలోకి వెళ్తున్నారనే ప్రచారం జరగడంతో ఆమె స్పందించారని సమాచారం.
2009లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేశారు. సికింద్రాబాదు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన గెలుపొందారు.

వైయస్ మృతి తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించడంతో ఆ పార్టీ వైపు మొగ్గారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పలుమార్లు ఆమె రాజకీయాల పైన తన అసంతృప్తిని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ పైన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఆమె తాను 2014 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫునే సికింద్రాబాదు నుండే పోటీ చేస్తానని తెలిపారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో ఆయా పార్టీల నుండి పలువురు నేతలు జంప్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications