ఏపీ రాజకీయాలు, జగన్ పాలనపై తన వైఖరేమిటో తేల్చేసిన అంబటి రాయుడు
అమరావతి: మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి తనదైన శైలిలో సెటైర్లు జోడించారు. తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తరువాత తన భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయంపైనా ఓ స్పష్టతను ఇచ్చారు.
ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు మాట్లాడారు. ఏపీలో పేద-ధనిక వర్గాల మధ్య ఉన్న తేడాను చెరిపేసేలా ప్రభుత్వ పరిపాలన సాగుతోందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభిస్తోన్నాయని చెప్పారు. ఏపీలో విద్యా వ్యవస్థలో జరుగుతోన్న మార్పులే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. విద్యను పేద ప్రజలకు మరింత చేరువ చేస్తోందని అన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే అనే విధానంలో ఏపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని అంబటి రాయుడు ప్రశంసించారు. ఈక్వాలిటీ పాలిటిక్స్‌ను ఏపీలో చూడగలుగుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం రంగంలో కూడా ఏపీ ప్రభుత్వం ఇదే రకమైన ధోరణిని అనుసరిస్తోందని, ప్రాంతాల మధ్య తేడాలు చూడట్లేదని పేర్కొన్నారు.
మచిలీపట్నం పోర్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ఈ పోర్ట్ వల్ల డెల్టాతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాగునీరు అందుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అంబటి రాయుడు చెప్పారు. తెలంగాణ మొత్తం బాగుపడుతుందని పేర్కొన్నారు. అనుబంధ పరిశ్రమలు ఎన్నో ఏర్పడుతాయని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
రాజకీయరంగ ప్రవేశంపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఉద్దేశం గానీ, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన గానీ లేదని తేల్చి చెప్పారు. తాను మంచి చేయగలుగుతాననే విశ్వాసం ప్రజల్లో ఏర్పడినప్పుడే రాజకీయాల్లోకి వస్తానని వివరించారు. దీనికోసం ప్రజల్లో తిరుగుతున్నానని, వారికి తాను ఎలా ఉపయోగపడాలనే విషయంపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని అన్నారు.
ఓటు అడగడానికి వెళ్లినప్పుడు తాను ఏం చేయగలుగాననే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని అంబటి రాయుడు స్పష్టం చేశారు. ప్రజలకు మనం ఏం చేయగలం అనే అంశంపై స్పష్టత వచ్చినప్పుడు డెఫినెట్‌గా జనంలోకి వస్తానని, వారి కోసం పని చేస్తానని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, వారిని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు.
రాజకీయాలనేవి పార్ట్ టైమ్ జాబ్ కాదని అంబటి రాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రతి నిమిషం పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఓ 10 రోజులు, అమెరికాలో ఓ 10 రోజులు ఉండి ఏపీలో రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదని అన్నారు. ఇక్కడే ఉంటూ ఇక్కడి ప్రజల కోసం ప్రతి క్షణాన్ని కేటాయించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications