ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి నాకు వీసా లేదు??
డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడైన కుర్రోడు మీటింగ్ పెడితే జనం విపరీతంగా వస్తారని భావించానని.. అందుకే తాను కూడా వెళ్లాలనుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే తనకు ఏపీకి వెళ్లడానికి వీసా లేకపోవడంతో వెళ్లలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు ప్లనరీపై పలు వ్యాఖ్యలు చేశారు.
ప్లీనరీ జరిగిన మొదటి రోజు రెండున్నర లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేశామని పార్టీ నాయకులు చెప్పుకున్నారని, కానీ వేల సంఖ్యలోనే భోజనాలు చేసినట్లు తనకు తెలిసిందన్నారు. ఒకరకంగా భోజన మెనూను ముందుగా ప్రకటించకపోయి ఉంటే ఆ సంఖ్యలో కూడా వచ్చివుండేవారు కాదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హాజరైన సభకే ప్రజలు రాకపోతే ఇతర సభలకు, సమావేశాలకు ఏం వస్తారని, పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకుంటే భయం వేస్తోందని రఘురామకృష్ణంరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉండటానికి వైఎస్ జగన్ ప్లీనరీలో చెప్పిన కారణమే నిజమైతే తమ పార్టీకి రాబోయే ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సీట్లకే పరిమితమవుతుందన్నారు.
భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి సభలో పాల్గొనడానికి ఎంపీ రఘురామ ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురవడంతో ఆయన పాల్గొనలేకపోయారు. నరసాపూర్ ఎక్స్ ప్రెస్‌లో బయలుదేరి బేగంపేట స్టేషన్ లో దిగిపోయారు. సత్తెనపల్లి దగ్గర బోగీని తగలబెట్టి తనను హత్య చేయడానికి కుట్ర పన్నారంటూ ఎంపీ ఆరోపించారు. ఆ తర్వాత ఢిల్లీ తిరిగివెళ్లిన రఘురామ తనకు ఏపీకి రావడానికి వీసా లేదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications