త్వరలో అన్నీ బయటపెడ్తా, పార్టీని వీడి వస్తా: లగడపాటి
విజయవాడ: తన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత తాను విభజన వెనుక గల అన్ని వివరాలను బయటపెడతానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పునరుద్ఘాటించారు. సమైక్యవాదినైన తనను సంకెళ్లులా బంధించిన పదవిని, పార్టీ కండువాను విడిచి ఉద్యమంలో పాల్గొంటానని, వారం రోజుల్లో తాను ఉద్యమంలో అడుగుపెడతానని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అధికారులతో సమీక్షించేందుకు జగ్గయ్యపేట వచ్చిన ఆయనను ఐకాస నేతలు అడ్డుకుని ఘెరావ్ చేశారు. సమైక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని, తెలంగాణలో ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉద్యమంలో పాల్గొన్నారని, ఇక్కడ ప్రజా ప్రతినిధులైన మీరు ఎందుకు ఉద్యమంలో పాల్గొనరని నిలదీశారు. దాదాపు అరగంటకు పైగా లగడపాటిని ఘెరావ్ చేశారు.

ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలోకి త్వరలోనే వస్తానని, ఒక పార్టీకి ఎంపిగా ఉద్యమ నేతగా తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని, ఈ బంధనాలు అన్నీ తొలగించుకుని వారంలో క్రియాశీల ఉద్యమంలో పాల్గొంటానని సర్దిచెప్పబోయారు. సామాన్య రాజగోపాల్‌గా ఉద్యమంలోకి వస్తానని తెలిపారు. రాజకీయ ఐకాసలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, పార్టీలకు అతీతంగా జరిగే ఉద్యమాన్ని ప్రజలు భుజాన వేసుకుని నడిపించారని, రాజకీయ జెఎసి ఉద్యమానికి మేలు చేయదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రితో కలిసి పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఏ పార్టీలో ఉన్నామన్నది అప్రస్తుతమని, అలాగే గెలుపు ఓటములతో కూడా సంబంధం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ముందున్న లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రితో సహా సీమాంధ్రలోని 95 శాతం మంది ప్రజాప్రతినిధులు సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామన్నారు. కాగా, తెలంగాణ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న, ఎఫిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పైన విమర్శలు చేస్తున్నా రాజకీయ నాయకులు పెదవి విప్పడం లేదని ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications