ఏపీ గవర్నర్‌ను కలిసిన గంధం చంద్రుడు: గంధం భువన్‌కు విశ్వభూషణ్ హరిచందన్ అభినందనలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు కుమారుడు గంధం భువన్ జయ్ కేవలం ఎనిమిదేళ్ల వయస్సులోనే యూరప్ ఖండంలోనే ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయం సాధించిన భువన్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు లభించాయి.
తాజాగా, గురువారం గంధం భువన్‌తో కలిసి వెళ్లిన గంధం చంద్రుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. గంధం భువన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌ను కూడా కుమారుడితో పాటు కలిశారు గంధం చంద్రుడు. ఈ సందర్భంగా సీఎం జగన్.. భువన్‌ను అభినందించారు.

కాగా, గంధం భువన్ జయ్.. మూడో తరగతి విద్యార్థి. క్రీడలు, పర్వతాల అధిరోహణ పట్ల చిన్నప్పటి నుంచే అతనిలో ఆసక్తి ఏర్పడింది. దీన్ని గమనించిన గంధం చంద్రుడు తన కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించాడు. అనంతరం కడప జిల్లా గండికోటలో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేర్పించారు. సాంకేతికంగా మెళకువలను ఇప్పించారు. కఠిన వాతావరణ పరిస్థితులకు తట్టుకుని పర్వతాలను అధిరోహించడానికి శారీరక దృఢత్వమే కాదు..మానసిక బలం అత్యవసరం.

ఎనిమిదేళ్ల చిరు ప్రాయంలో- అలాంటి ఆత్మ విశ్వాసాన్ని, మానిసక బలాన్ని సొంతం చేసుకున్నాడు భువన్. ఎనిమిదేళ్ల వయస్సులోనే అత్యున్నత పర్వత శిఖరాలను అధిరోహించడాన్ని అలవాటుగా మార్చకున్నాడు. ఇదివరకు లఢక్‌లో అతి ఎత్తయిన ఖర్దుంగ్ లా శిఖరాన్ని అధిరోహించాడు. మరోసారి అలాంటి సాహస కృత్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. యూరప్‌లో అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించాడు. ఈ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఈ నెల 18వ తేదీన భువన్ జయ్ ఈ రికార్డు నెలకొల్పాడు.
రష్యాలో ఉంటుందీ మౌంట్ ఎల్బ్రస్. ఐరోపా ఖండంలో ఉన్న ఏడు అతిపెద్ద శిఖరాగ్రాల్లో ఇదీ ఒకటి. దీని ఎత్తు 5,642 మీటర్లు. ప్రతి నిమిషం అక్కడి వాతావరణం మారుతుంటుంది. అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది దీని శిఖరాగ్రం. మైనస్‌లో ఉంటుంది అక్కడి టెంపరేచర్. అలాంటి శిఖరం.. అగ్రభాగాన్ని అందుకోవాలంటే సాహసమే. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. దానికి మించిన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. క్షణక్షణానికి మారిపోయే వాతావరణానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ మౌంట్ ఎల్బ్రస్‌ను విజయవంతంగా అధిరోహించాడు గంధం భువన్ జయ్.
Recommended Video
విశాఖపట్నానికి చెందిన భూపతి రాజు వర్మ, బెంగళూరుకు చెందిన నవీన్ మల్లేష్‌తో కలిసిన టీమ్‌తో గంధం భువన్ జయ్ తన రష్యా ప్రయాణాన్ని ఆరంభించాడు. ఈ నెల 11వ తేదీన రష్యాకు బయలుదేరి వెళ్లారు. అనంతరం టెర్స్కాల్‌లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్ క్యాంప్‌ను చేరుకున్నాడు. 13వ తేదీన 3,500 మీటర్లు, 15న 4,300 మీటర్లు, 18వ తేదీన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని అందుకున్నాడు. 19వ తేదీన మళ్లీ టెర్స్కాల్ బేస్‌క్యాంప్‌కు చేరుకున్నాడు. తన టీమ్‌తో కలిసి గంధం భువన్ జయ్ స్వదేశానికి చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications