ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు - ప్రాధమిక ఆధారాలున్నాయి : హైకోర్టులో పిటీషన్ కొట్టివేత..!!
ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయడంతోపాటు పరిహారం ఇప్పించాలంటూ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి 2015లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. మైనింగ్ లీజులు కేంద్రం పరిధిలోనివని, ఇందులో తన పాత్ర లేదన్న శ్రీలక్ష్మి వాదనను అంగీకరించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలనుబట్టి ఓఎంసీకి లీజులు మంజూరు చేయాలని శ్రీలక్ష్మి ప్రతిపాదనలు పంపినట్లుందని వివరించారు.

ప్రాధమిక ఆధారాలున్నాయంటూ
తిరస్కరించిన దరఖాస్తుదారులకు నోటీసులిచ్చి వారి అభ్యర్థనలను విన్నాక నిర్ణయం తీసుకోవాలని, ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను ఉత్తర్వుల్లో పేర్కొనాల్సి ఉందని తెలిపారు. పిటిషనర్ వాదనలను న్యాయమూర్తి తిరస్కరించారు. శ్రీలక్ష్మి ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె బంధువు రాకేష్‌బాబు ఆస్తులను కూడబెట్టినట్లు స్పష్టమైన ఆరోపణలున్నాయని పేర్కొన్నారు.
దీనిపై కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఓఎంసీపీఎల్, బీఐఓపీఎల్‌తోపాటు ఇతర కంపెనీల సరిహద్దు వివాదం, అక్రమ మైనింగ్ మాత్రమే విచారించాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని.. అంతకుముందున్న లీజుల వ్యవహారాల్లోకి వెళ్లరాదన్న శ్రీలక్ష్మి వాదనతో ఏకీభవించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు.

శ్రీలక్ష్మీ పిటీషన్ కొట్టివేత
అక్రమ లీజులతోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, దీనిపై దర్యాప్తు పరిధి సీబీఐకి ఉందని వివరించారు. శ్రీలక్ష్మి ప్రస్తావించిన మాయావతి కేసు ఇక్కడ వర్తించబోదన్నారు. క్యాప్టివ్ మైనింగ్ సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించినందున తాను చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు పరిగణనలోకి తీసుకోరాదన్న శ్రీలక్ష్మి వాదన అర్థరహితమని పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే..క్రిమినల్ కేసును కొట్టివేయడానికి హైకోర్టు పరిధిని చర్చించడం సముచితమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Recommended Video

సీబీఐ విచారణ పరిధి ఉంది
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అవినీతి నిరోదక చట్టం సెక్షన్లకు సైతం ప్రాథమికంగా సీబీఐ ఆధారాలను సమర్పించిందని హైకోర్టు పేర్కొంది. కాబట్టి అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవు అన్న పిటిషనర్ వాదన నిలువజాలదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ప్రభుత్వ కార్యదర్శిగా ఉండగా అక్రమాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీబీఐ కేసుపై ట్రయల్ జరుగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications