టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
Vangaveeti Radhakrishna: మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న రాయి దాడి అనంతరం అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. ఈ దాడి తరువాత తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ఆత్మరక్షణలో పడింది.
ఈ దాడి వెనుక పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా మహేశ్వరరావు ప్రమేయం ఉందంటూ నిర్ధారించింది సిట్. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం చేపట్టిన విచారణ సందర్భంగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. దీనితో ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

వైఎస్ జగన్‌పై దాడి కేసు ఘటనను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటకే తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో బోండా ఉమా ప్రమేయం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు. బోండా ఉమా అరెస్టయితే- విజయవాడ సెంట్రల్ అభ్యర్థిని మార్చాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
బోండా ఉమాను మార్చాల్సి వస్తే ప్లాన్ బీని సిద్ధం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆయనకు బదులుగా వంగవీటి రాధాకృష్ణకు టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే బోండా తన నామినేషన్ పత్రాలను సైతం దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే 29వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.

ఈలోగా బోండా ఉమా అభ్యర్థిత్వాన్ని మార్చాల్సి వస్తే ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుని వంగవీటి రాధాతో 25వ తేదీలోగా నామినేషన్ వేయించాలని టీడీపీ ప్లాన్ బీగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా కూడా వైఎస్ జగన్‌పై దాడి ఘటన కేసు పురోగతి, బోండా ఉమా అరెస్ట్, ఈసీ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉన్నాయి.
గతంలో విజయవాడ సెంట్రల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు వంగవీటి రాధా. ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు గానీ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications