హేమంత్ సోరెన్ తరహాలోనే జగన్ పై అనర్హత వేటు ? రఘురామ లాజిక్ ఇదే-అంతా కేంద్రం చేతుల్లో!
తనకు తానే గనులు కేటాయించుకున్న వ్యవహారంలో అనర్హత వేటు ప్రమాదం ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు వార్తల్లోకెక్కారు. ఇలాంటి వ్యవహారాల్లో గతంలో చూసీచూడనట్లుగా వదిలేసిన కేంద్రం, ఈసీ ఇప్పుడు ఆయన్ను దారిలోకి తెచ్చుకునేందుకు అనర్హత వేటును ప్రయోగించబోతోంది.
ఈ మేరకు ఈసీ చేసిన సిఫార్సుల్ని గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా ఆమోదిస్తో సోరెన్ ఎమ్మెల్యే పదవి కోల్పోవడం ఖాయం. దాంతో పాటే జార్ఖండ్ ప్రభుత్వం కూడా కుప్పకూలుతుంది. అదే జరిగితే ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే ఇబ్బంది ఎదుర్కొంటారా అన్న దానిపై చర్చ మొదలైంది.

హేమంత్ సోరెన్ అనర్హత వేటు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తనకు తానే అక్రమంగా గనులు కేటాయించుకున్న వ్యవహారంలో అనర్హత వేటు ప్రమాదం ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇలా చేయడం చట్ట విరుద్ధం కావడంతో ఈసీ ఆయనపై అనర్హత వేటుకు రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ కు సిఫార్సు చేసింది.
దీంతో ఆయన న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా నిపుణుల సలహా తీసుకుంటున్నారు.అనంతరం సోరెన్ పై వేటు విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే సోరెన్ ఆరునెలల్లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం లేదా గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.

సోరెన్ పై వేటు పడితే జగన్ కూ ఇబ్బందా?
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై తనకు తాను గనులు కేటాయించుకున్న వ్యవహారంలో అనర్హత వేటు పడితే ఆ తర్వాత ఇదే తరహాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పైనా దాదాపు అవే ఆరోపణలతో న్యాయపోరాటం చేసేందుకు ప్రత్యర్ధులకు అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
దీనికి ప్రధాన కారణం గుంటూరు జిల్లాలో జగన్ తన కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్ కు అనుమతులు ఇచ్చుకోవడం, తన కుటుంబానికే చెందిన సాక్షి దినపత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడం కారణంగా చెప్తున్నారు. ఈ రెండు అంశాల్లో జగన్ కూ ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారాన్ని ప్రత్యర్ధులు తెరపైకి తెస్తున్నారు.

రఘురామ లాజిక్ ఇదే
హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు పడితే ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిన్న ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం సోరెన్ చేసింది తప్పయితే అంతకంటే భారీ అవినీతి చేసిన జగన్ ది కూడా తప్పే అవుతుందన్నారు.
సొంత కంపెనీ సరస్వతీ పవర్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ అనుమతుల కేటాయింపుతో పాటు సాక్షి దినపత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడం ఇలాంటి వ్యవహారం కిందకే వస్తుందన్నారు. సాక్షికి మూడున్నరేళ్లలో రూ.200 కోట్ల విలువైన ప్రకటనలు ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. వీటి ఆధారంగా జగన్ పైనా సోరెన్ తరహాలోనే అనర్హత వేటు వేసేందుకు అవకాశం ఉందన్నారు.

అంతా కేంద్రం చేతుల్లోనే?
ప్రస్తుతానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు. హేమంత్ సోరెన్ తరహాలో మోడీ ప్రత్యర్ధులతో జత కట్టలేదు. అధికారంలోకి రాగానే మోడీని కలిసి మద్దతు ప్రకటించిన జగన్.. ఇప్పటికీ అదే విథేయత చూపుతున్నారు.దీంతో జగన్ విషయంలో సోరెన్ తరహా ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారంలో ఎవరైనా కోర్టుల్ని ఆశ్రయిస్తే మాత్రం తాత్కాలికంగా జగన్ ఇబ్బందులు పడొచ్చని కొందరు చెప్తున్నారు. అయితే అంతిమంగా గవర్నర్, ఈసీలతో ముడిపడిన వ్యవహారాలు కాబట్టి కేంద్రాన్ని కాదని ఈ రెండు వ్యవస్ధలు దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చనేది మెజారిటీ వర్గాల వాదన.












Click it and Unblock the Notifications