Rushikonda buildings: రుషికొండ భవనాల రహస్యం రోజాకే ఎరుక
రుషికొండ భవనాల వివాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఋషికొండ భవనాల వివాదం పైన మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రుషికొండలో పర్యాటకశాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అంటూ ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాన్ని నిర్మిస్తే తప్పా అంటూ రోజా ప్రశ్నించారు.
రోజా ట్వీట్ కు బుద్దా వెంకన్న కౌంటర్
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా.. అని పేర్కొన్న రోజా వెన్ను చూపేది లేదు.. వెనకడుగు వేసేది లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక రోజా ట్వీట్ కు టిడిపి నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషికొండపై రోజా మాట మార్చడాన్ని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న అసలు రుషికొండ భవనాల విషయంలో రోజాని ఎంక్వయిరీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు.

రుషికొండను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారు?
నాడు త్రీ మ్యాన్ కమిటీ కథ కూడా బయటకు వస్తుందని పేర్కొన్నారు. రుషికొండ భవనాలు కాసేపు రాష్ట్రపతి కోసమని, కాసేపు ప్రభుత్వానివని చెబుతున్నారని, రుషికొండను బోడి గుండు చేయమని మీకు ఎవరు చెప్పారు అంటూ బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. రోజా ను ఎంక్వయిరీ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్న ఆయన ఓటమి కారణంగా రోజాకి మతి చెడినట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు.
దొరికితే దొంగలా.. లేకుంటే దొరలా.. రోజా కబుర్లు
చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. దొరికితే దొంగలా.. లేకుంటే దొరలా.. రోజా కబుర్లు ఉన్నాయని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో సోకులు చేసుకునేందుకు సిద్ధమైన మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ పేర్కొన్నారు బుద్దా వెంకన్న. ఇక రుషికొండలో భవనాలను ప్రారంభోత్సవం చేసినప్పుడు మంత్రి రోజా అప్పుడు సీఎం నివాసం ఉండడానికని, అక్కడనుండే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తారని చెప్పారన్నారు.
రోజాను ఎంక్వయిరీ చేస్తే విషయం మొత్తం బయటకు వస్తుంది
నేడు పర్యాటకుల కోసం నిర్మించామని చెబుతున్నారని బుద్ధ వెంకన్న మండిపడ్డారు. వాళ్ల అవసరానికి తగ్గట్టుగా మాట మారుస్తున్నారని,పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రోజాను ఎంక్వయిరీ చేస్తే విషయం మొత్తం బయటకు వస్తుందంటూ బుద్ధ వెంకన్న పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications