మోదీని జగన్ కాదనగలరా?
YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
నేడు అనంతపురం జిల్లా రాప్తాడులో మూడో విడత బహిరంగ సభను నిర్వహించబోతోంది వైఎస్ఆర్సీపీ. 280 ఎకరాల్లో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరిస్తోంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు జగన్ రాప్తాడుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

అదే సమయంలో తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన- బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరితే.. వైఎస్ఆర్సీపీ ఎటు వైపు నిల్చుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వస్తోందా పార్టీ. అటు ఎన్డీఏకు గానీ, ఇటు కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాలో గానీ చేరలేదు.
అలాగని కేంద్రంతో ఘర్షణ వైఖరికీ వెళ్లట్లేదు. ఒకింత ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నారు. సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకుంటోన్నారు వైఎస్ జగన్. పార్లమెంట్‌లో వైఎస్ఆర్సీపీ సభ్యులు.. అధికార పక్షం ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇస్తూనే వస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే.. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయనేది చర్చనీయాంశమైంది. టీడీపీ చేరిన తరువాత కూడా జగన్ ఎన్డీఏకే మద్దతు ఇస్తారా? లేక.. దూరమౌతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
దీనిపై ఏపీ కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్ తులసీరెడ్డి స్పందించారు. టీడీపీ.. ఎన్డీఏలో చేరిన తరువాత వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్‌గా ఆ కూటమికి దూరమౌతారని వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్‌లోకి వైసీపీ చేరాలనుకుంటే ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు. వైసీపీకి మరో మార్గం ఉండదనీ చెప్పుకొచ్చారు.

మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో వచ్చినప్పటికీ.. రాష్ట్రంలో గెలిచినా, ఓడినా వైఎస్ఆర్సీపీ మాత్రం ఇప్పుడున్న తటస్థ వైఖరినే కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనాలేవీ ఉండబోవని జగన్ బలంగా నమ్ముతున్నారనేది పార్టీ వర్గాల అభిప్రాయం. మోదీని కాదని కాంగ్రెస్ వైపు వెళ్లే ఆలోచన జగన్ చేయబోరనీ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications