మరో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. సెప్టెంబర్ నెల మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతా వరణ శాఖ వెల్లడించింది. తాజాగా ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత ఉత్తర ఒడిశాలో తీరం దాటి పశ్చిమ వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉంది. దీంతో, రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయంది.

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 9.3, వజ్రపుకొత్తూరులో 8.1, చినబాడాంలో 7.9, పలాసలో 7, రావివలసలో 5.6, హరిపురంలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఇక, ఈ రోజు (బుధవారం) శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఈశాన్య తెలంగాణపై అల్పపీడనం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
దీంతో, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కొమురంభీం, భూపాలపల్లి, కరీంనగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్..నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తాజా వర్షాల పైన అధికాయ యంత్రాంగం అప్రమత్తం అయింది.












Click it and Unblock the Notifications