రుతువపనాల కదలిక, అనుకూలం - వర్షాల పై తాజా ప్రకటన..!!
వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కింది. అయితే ఆశించిన వేగంగా కాకుండా..జాప్యం జరిగే అవకాశంఉందని అంచనా వేస్తున్నారు. ఏపిలో ఎండల తీవ్రత మరో రెండు రోజులేనని, ఆ తర్వాత రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రోజుల సమయంలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
రుతుపవనాల కదలికలో:అరేబియా సముద్రంలో ఏర్పడిన బపర్జాయ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాల కదలిక బాగా నెమ్మదించింది. గత వారమే రాష్ట్రంలోకి ప్రవేశించినా..ఇప్పటి వరకు విస్తరించలేదు. దీంతో వడగాల్పుల తీవత్ర ఎక్కువైంది.

ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. తాజాగా ఈ నెల 18 నుంచి 21 వరకు రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, దీంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
విస్తరణకు అనుకూలం:రాష్ట్రం వైపు పడమటి గాలులు వీస్తున్నందున రాబోయే రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు..ఉరుములతో కూడిన జల్లలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో రుతుపవన గాలులు మరింత బలపడేందుకు రెండురోజుల సమయం పడుతుందని తాజాగా వాతావరణ శాఖ పేర్కొంది. 19న కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.
నైరుతి గాలులు పుంజుకుంటున్నందున రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. నేడు (ఆదివారం) రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు.
రెండు రోజుల్లో వర్షాలు మొదలు:పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టడంతో పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోత నెలకొంటోంది. దీని వల్ల జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా పగలు సమయంలో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications