చల్లని కబురు, కదలిన రుతువపనాలు - వర్షాలపై తాజా అప్డేట్..!!
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం దొరికింది. ఊరిస్తూ వస్తున్న నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించిన రుతుపవనాల ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మోస్తరు నుంచి భారీ వర్షం:ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా సెగ తగ్గి వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

సాయంత్రం 6గంటల వరకు అత్యధికంగా విజయవాడలో 66.5, మంగళగిరి, కొండపిలో 64, ఎ.కొండూరులో 58.5, కొల్లిపరలో 49.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అనువైన వాతావరణం:రానున్న రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారేందుకు అనువైన వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 23న ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, మరుసటి రోజుకు అల్పపీడనంగా బలపడుతుందని చెప్పారు..
తరువాత ఒడిశా, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని వివరించారు. దీంతో రుతు పవనాలు చురుగ్గా మారి దక్షిణాదితోపాటు మధ్య భారతం, పశ్చిమ భారతంలో ముందుకు పురోగమిస్తాయని అంచనా వేశారు. అల్పపీడనం రాజస్థాన్ వైపు పయనించే క్రమంలో ఈ నెల 25, 26 తేదీల్లో కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

పలు చోట్ల భారీ వర్షాలు:గురువారం కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది.
గురువారం నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ నెల 10వ తేదీకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆగమనం ఆలస్యం అవుతున్నదని వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంచనాలతో ఇక ఎండల నుంచి ఉపశమనం లభించనుంది.












Click it and Unblock the Notifications