చల్ల చల్ల చల్లగా.. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్
ఒకవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండగా మరోవైపు రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న రెండు రోజుల్లో ఇది వాయువ్య దిశగా పయనిస్తుంది. మధ్యప్రదేశ్ మీదగా వెళ్లనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీకి దూరంగా ఉండటంతో చెదురుమదురు వర్షాలు పడ్డాయి.
ఏపీతోపాటు యానాంలో పశ్చిమ వాయువ్యదిశగా గాలులు వీస్తున్నాయి. సాయంత్రం వేళ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, నంద్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు మంచి తేలికపాటి వర్షాలు పడతాయని, అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష సూచన చేసింది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయి.












Click it and Unblock the Notifications