Ap: ఏపీకి ప్రమాద హెచ్చరిక
మీరెవరూ కంగారు పడాల్సిన అవసరంలేదు.. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు అంటోంది వాతావరణశాఖ. వర్షాకాలంలో కూడా వేసవికాలాన్ని తలపిస్తున్న ఎండల్ని చూసి ఏపీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు విద్యుత్తు కోతలు పుండుమీద కారంలా మారాయి. ఒకరోజు వర్షం కురిస్తే తర్వాతరోజు రోళ్లు పగిలే ఎండ కాస్తోంది. దీంతో ఏంచేయాలో పాలుపోక ప్రతిరోజు వర్షం కురిపించమంటూ దేవుణ్ని కోరుకుంటున్నారు.
దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు వ్యాపించిన ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. ఇంకోవైపు నుంచి దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పిడుగులు పడతాయని చెబుతోంది.

గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వెలివాడలో 9.8 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 8.5, సంతబొమ్మాళిలో 7.9, గరికిపాలెంలో 7.1, తులుగులో 6.8, ఎచ్చెర్లలో 6.3, గొట్టా బ్యారేజి వద్ద 6.1, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 6.2, విజయనగరంలో 5.3, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 4.6, ఆనందపురంలో 4.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
రాష్ట్రంలో ఓవైపు వర్షాలు కురుస్తుంటే.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత మరింత తీవ్రంగా కొనసాగుతోంది. దక్షిణ కోస్తాలో వాతావరణానికి ప్రజలు హడలిపోతున్నారు. ఎండకు తోడు ఉక్కపోత ఉండటంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతం. దేశం మొత్తంమీద ప్రకాశం జిల్లా ఒంగోలులో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వాన కురిసింది.












Click it and Unblock the Notifications