జగన్‌పై బాంబుపేల్చిన జస్టిస్ రాకేష్- సీజేకు లేఖతో అనుచిత లబ్ది-సీజేల బదిలీలతో కేసుల జాప్యం
జగన్ వర్సెస్ జడ్డీలుగా సాగుతున్న యుద్ధం మరో అనూహ్య మలుపు తీసుకుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు హైకోర్టులోని మరికొందరు జడ్డీలపై ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వల్ల ఆయనకు అనుచిత లబ్ది చేకూరిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు తాజాగా జరిగిన నతెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీల వల్ల కూడా కేసుల జాప్యంతో సీఎం జగన్ ప్రయోజనం పొందినట్లు జస్టిస్ రాకేష్ ఆరోపించారు. న్యాయమూర్తిగా తన రిటైర్మెంట్ తేదీకి ఒక్క రోజు ముందు ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

జస్టిస్ రాకేష్ కుమార్ సంచలనం..
ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడ్డాయని భావిస్తున్న తీర్పులతో ప్రభుత్వానికీ, హైకోర్టుకూ మధ్య పెరిగిన అగాధం కొనసాగుతోంది. అయితే ఇవాళ పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ ఈ మధ్య కాలంలో హైకోర్టులో కొన్ని కీలక కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వంపై తాను చేయని వ్యాఖ్యలను చేశానని చూపిస్తూ విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం కోరడంపై నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాను ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశానని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సమాధానం లేకపోవడంతో మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ ప్రవీణ్ కుమార్‌పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఈ కేసు తీర్పుపై ఏకంగా సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఛీఫ్ జస్టిస్‌కు లేఖతో జగన్‌కు అనుచిత లబ్ధి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారంటూ గతంలో సీఎం జగన్ సుప్రీం ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. రెండు రోజుల తర్వాత దాన్ని బయటపెట్టారు. దీని వల్ల జగన్‌కు భారీగా అనుచిత లబ్ది చేకూరిందని జస్టిస్ రాకేష్ కుమార్ నిన్నటి తన తీర్పులో ఆరోపించారు. ఈ లేఖతో అనుచిత లబ్ధి పొందడంలో జగన్ సక్సెస్ అయ్యారని జస్టిస్ రాకేష్ ఆరోపించారు. ఈ లేఖ వల్ల అంతిమంగా జగన్ లబ్ది పొందుతారో లేదో తెలియదు కానీ ఆయనపై ఉన్న సీబీఐ కేసులు, ఏపీలో మూడు రాజధానుల కేసులు పర్యవేక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ఛీఫ్ జస్టిస్‌ల బదిలీలు మాత్రం జరిగాయన్నారు.

ఛీఫ్ జస్టిస్‌ల బదిలీలతో కేసుల జాప్యం..
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణంలో జగన్‌పై నమోదైన అక్రమాస్తులను సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. మరోవైపు ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో మూడు రాజధానుల కేసుల విచారణ జరుగుతోంది. కానీ ఈ రెండు ప్రధాన మైన కేసుల విచారణ బాధ్యత పర్యవేక్షిస్తున్న తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీల వల్ల వీటి విచారణ జాప్యం జరుగుతుందని జస్టిస్ రాకేష్ కుమార్ ఆరోపించారు. ఛీఫ్ జస్టిస్‌కు జగన్ రాసిన లేఖ వల్ల జరిగిన ఈ రెండు బదిలీలతో ఆయనకు కీలక మైన రెండు కేసుల్లో విచారణ జాప్యమవుతుందని రాకేష్ తెలిపారు.

రాజధాని కేసులు మొదటికొస్తాయోమో..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా కేసుల విచారణపైనా ఛీఫ్ జస్టిస్ బదిలీ ప్రభావం ఉంటుందని జస్టిస్ రాకేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే మూడు రాజధానులపై ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణ మళ్లీ మొదటికొస్తుందేమో అని రాకేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఛీఫ్ జస్టిస్ మహేశ్వరి బదిలీపై వెళ్లడం వల్ల రాజధాని కేసుల కోసం తిరిగి కొత్త బెంచ్ ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు పిటిషన్ల విచారణ కూడా మళ్లీ మొదటికొస్తుందని రాకేష్ తన తీర్పులో పేర్కొన్నారు.

ఖైదీ నంబర్ 6093 అని కొడితే దిగ్భ్రాంతిగొలిపే వాస్తవాలు
జగన్ ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాసే వరకూ ఆయన గురించి పెద్దగా తెలియదని, కానీ ఎవరో గూగుల్‌లో ఖైదీ నంబర్ 6093 అని
కొడితే చాలా వివరాలు వస్తాయని తనకు చెప్పారని రాకేష్ వెల్లడించారు. ఆ తర్వాత తాను వెతికితే జగన్ గురించి దిగ్భ్రాంతి గొలిపే వాస్తవాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు, మరో 16 ఐపీసీ సెక్షన్ల కేసులు ఉన్నట్లు తేలిందన్నారు. వీటిలో ఐపీసీ సెక్షన్ల కేసులను ఆధారాలు లేవన్న కారణంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం కన్నుసన్నల్లో పోలీసులు ఎలా పనిచేస్తున్నారన్నాడడానికి ఇదే నిదర్శనమన్నారు.