2026 వరకు తెలుగుదేశం పార్టీ ఎదురుచూపులు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో అడుగు పెట్టాలంటే 2026వ సంవత్సరం వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కనకమేడల రవీంద్రకుమార్ ఒక్కరే సభ్యులు, ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ 22వ తేదీతో పూర్తికానుంది. అదేరోజు భారతీయ జనతాపార్టీ ఎంపీ సీఎం రమేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీకాలం కూడా పూర్తవుతోంది.
2024 ఏప్రిల్ 22వ తేదీతో రాజ్యసభలో తెలుగుదేశం బలం సున్నా అవుతుంది. ఎటువంటి ప్రాతినిధ్యం ఉండదు. ఆ పార్టీ రాజ్యసభలో అడుగుపెట్టాలంటే 2026 వరకు ఎదురుచూడక తప్పదు. 2024 ఏప్రిల్-మే నెలల్లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే విజయం సాధించిన పార్టీకి రాజ్యసభ స్థానాలు దక్కుతాయి.

ఏపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి 23 ఉన్నాయి. వీరిలో వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరి, కరణం బలరాంలాంటివారు వైసీపీకి అనుబంధ సభ్యుల్లా కొనసాగుతున్నారు.
రాజ్యసభకు 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీ నుంచి మూడు స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకుంటుంది. దీంతో ఆ పార్టీ బలం రాజ్యసభలో 11కు చేరుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడూ లేనివిధంగా 11 మంది సభ్యలుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించనుంది. జూన్ 10వ తేదీన జరిగే ఎన్నికల్లో వైసీపీ బలం తొమ్మిది మంది సభ్యులకు చేరుతుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు ఇటువంటి పరిస్థితి రావడం విచారకరమని, ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే అధికార పక్షం పనులు బాగా చేయగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications