తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదు - జగన్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు.వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.
ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తోన్న తీరుపై ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ.. తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని, ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. బైరాగిపట్టెడలో ఐదుగురు చనిపోయారని FIRలో ఉంది.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారని జగన్ తెలిపారు. స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. వారు కోలుకున్నాక ఇంటికి పంపించేటప్పుడు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చి పంపించాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications