కరెంట్ ఛార్జీలు పెంచితే సహించేది లేదు.!తగ్గించే వరకూ పోరాటం తప్పదన్న పవన్ కళ్యాణ్.!
అమరావతి/హైదరాబాద్ : వైసీపి ప్రభుత్వానికి పవర్ ఛార్జీలు పెంచే పవర్ ఎవరిచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో జనాలు బెంబేలెత్తి పోతుంటే విద్యుత్ ఛార్జీలను పెంచాలనుకోవడం వైశాచికత్వం అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్య మద్యతరగతి ప్రజలపైన భారం మోపుతామంటే జనసేన పార్టీ చూస్తూ ఉండదని పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకోం.. జనాలు కష్టాల్లో ఉన్నారన్న పవన్ కళ్యాణ్
ఏపి ప్రజలకు ఏ కష్టాలొచ్చినా తానున్నానంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా షూటింగ్ లు లేకపోతే ఆయన సాధ్యమైనంత వరకు అమరావతిలో క్యాంప్ వేసి ప్రజల కష్టాలపట్ల, ప్రభుత్వ విధానాల పట్ల ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ మంత్రుల అవినీతిని ఎండగట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా వైసీపి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని పూర్తి స్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సరైన జీవనోపాది లేక ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని, విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో వారిపైన అదనపు భారం మోపితే సహించేది లేదని తెలిపారు.

అన్ని కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన.. పోరాటం ఆగదన్న భీమ్లా నాయక్
ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుందని జనపేన ఎద్దేవా చేసింది. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందని, ఆదాయం లేదు... రాబడి లేదు ... ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారని, చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ పై అధిక వ్యాట్, లిక్కర్ పై అయితే సరే సరి అని, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారని మండిపడ్డారు.

200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది? ఏపీ సీఎంను సూటిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, ఇచ్చిన మాటను మరిచిపోయారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న మనం, ఇవాళ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోయేలా తయారు చేసారని, గ్రామాల్లో 3 నుంచి 6 వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్, ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలని, బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో తమరే చెప్పాలని సీఎం జగన్ ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు.. వైసీపిని హెచ్చరించిన పవన్ కళ్యాణ్
తెల్లారిందంటే చాలు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొందని, పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications