imd ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక జారీచేసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాడ్పుల విషయంలో కొన్ని సూచనలు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాయలసీమలో మాత్రం ఎండలు కొనసాగుతాయని తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎక్కడా 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో మాత్రమే 42 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. 19 మండలాల్లో తీవ్రంగా, 63 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీచాయి.
ఈరోజు మాత్రం 129 మండలాల్లో తీవ్రంగా, 11 మండలాల్లో సాధారణ వడగాడ్పులు వీయనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉదయం 11.00 గంటలనుంచి సాయంత్రం 4.00 గంటల వరకు బయటకు రావొద్దని, గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రానున్న మూడురోజులపాటు ఉత్తరకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.

దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు పడతాయి. మరోవైపు ఉక్కపోత, వేడి వాతావరణం నెలకొంటుంది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల సీజన్ లో మాత్రం వర్షపాతం 102 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రుతుపవనాల కదలిక బలపడే అవకాశం ఉందని, దీనివల్ల మంచి వర్షాలే కురవనున్నాయని అధికారులు తెలిపారు. రెండురోజుల నుంచి ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, మరో వారంరోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, శ్రీరామనవమికి ముందురోజు కానీ, తర్వాత రోజు నుంచికానీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో వేడి వాతావరణం విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications