ఏపీలో ఈ జిల్లాలకు హెచ్చరిక జారీచేసిన వాతావరణశాఖ
మండుతున్న ఎండల్లో అక్కడక్కడా కురుస్తున్న వానలకు వాతావరణం చల్లబడటంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర కోస్తా తీరంపై విస్తరించిన ఆవర్తనంవల్ల రాయలసీమతోపాటు కోస్తాలో కూడా రానున్న మూడు రోజులు సాధారణ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడి జల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల సాధారణ జల్లులు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.
కొన్నిచోట్ల తేలికపాటి నుంచి సాధారణం
ఏలూరు, కర్నూలు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్నారు.

నంద్యాల జిల్లాలో అత్యధికంగా
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 40 మిల్లీ మీటర్లు, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 85.8 మిల్లీ మీటర్లు, నంద్యాల జిల్లా పీ పల్లిలో 50.6, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 37.2, కృష్ణా జిల్లా ముసులిపట్నంలో 32.9, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 28.6, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 58.6, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 34.2, ప్రకాశం జిల్లా రచర్లలో 33.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా రానున్న రెండురోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలకు ఆస్కారం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీచేశారు.












Click it and Unblock the Notifications