ఆంధ్రప్రదేశ్ కోసం రైల్వే కీలక నిర్ణయం
ఏపీలో నాలుగు జిల్లాలకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుపతి నుంచి ధర్మానికి నిలువెత్తు మానవ రూపమైన శ్రీరాముడు కొలువైన అయోధ్యకు ఆస్తా స్పెషల్ పేరుతో దీన్ని నడుపుతున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైలును అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.
రూ.2,440 ప్యాకేజీతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. దాదాపు 500 మంది భక్తులు ఈ రైలులో అయోధ్యకు బయల్దేరారు. భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు, పండ్లు, ఫలహారాలను అందజేశారు. తిరుపతి పక్కనే ఉన్న నెల్లూరు, చిత్తూరు అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఆయా జిల్లాల ప్రజలు అయోధ్యలో కొలువైన రామ్ లల్లాను దర్శించుకోవడానికి రైల్వే కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అయోధ్య నుంచి కాశీ పుణ్యక్షేత్రానికి నాలుగున్నర గంట సమయం పడుతుంది. దీంతో కాశీ, అయోధ్య, నైమిశారణ్యం పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కాశీ, అయోధ్య ఒకేసారి చూసిరావచ్చనే ఆలోచనతో భక్తులు తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. వాస్తవానికి అయోధ్యలో రామ్ లల్లాను ప్రతిష్టించకముందు కాశీకి మాత్రమే వెళ్లివచ్చేవారు. ఇకనుంచి కాశీ, అయోధ్యకు వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాల నుంచి అయోధ్యకు రైళ్లు బయలుదేరుతున్నాయనే విషయాన్ని ఆయా జిల్లాల్లోని భారతీయ జనతాపార్టీ నాయకులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications