వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ బిగ్ అప్డేట్..!!
వందేభారత్ నిర్వహణ పైన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు వందేభారత్ సర్వీసులు కొనసాగుతున్నాయి. ప్రయాణీకుల నుంచి వస్తున్న ఆదరణకు అనుగుణంగా రైల్లను పెంచేలా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో సెమీ హైస్పీడ్ రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే వరకు వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ల వేగం తగ్గించింది.
వేగం తగ్గింపు
ఆటోమ్యాటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చేవరకు సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ల వేగాన్ని గంటకు 160 కి.మీ నుంచి 130 కి.మీ.కి తగ్గించినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నల్) నార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్) జోన్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. హజ్రత్ నిజాముద్దీన్, ఆగ్రా-ఢిల్లీ మార్గాల్లో వందేభారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే గంటకు 160 కి.మీ. వేగంతో నడుస్తున్నాయి.

130 కిమీ వేగంతో
ఆటోమ్యాటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ పనిచేసేవరకు ఎన్‌సీఆర్ జోన్ పరిధిలో రైళ్లు గరిష్టంగా గంటకు 130 కి.మీలోపు వేగంతో నడవాలని నిర్ణయించాం. ఇంతకుముందు సూచించినట్టుగా ఈ జోన్ విభాగంలో ఐఆర్-ఏటీపీ కవచ్ పనులు వేగవంతం చేయాలని ఆ లేఖలో సూచించారు. ఈ నెల 25 నుంచే స్పీడ్ లిమిట్ అమలులో ఉందని తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
సమయాల్లోనూ మార్పు
రైల్వే బోర్డు ప్రకారం గతిమాన్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12050/ 12049 ఢిల్లీ-ఝాన్సీ), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 22470/22469 నిజాముద్దీన్-ఖజురహో), వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 20172/20171 ఢిల్లీ-రాణి కమలాపతి) రైళ్ల వేగం తగ్గింది. కాగా, ఢిల్లీ-ఆగ్రా రూట్ మినహా మిగిలిన అన్నిచోట్లా వందేభారత్ 130 కి.మీ. వేగంతోనే నడుస్తోంది. దీంతో..వందేభారత్ రైళ్ల నిర్వహణ వేళల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని పైన పూర్తి కసరత్తు తరువాత సమయాల పైన నిర్ణయం అమలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications