తిరుపతి, రాజమండ్రి- ముంబాయి డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం: టైమింగ్స్..!!
ఏపీకి మరో రెండు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటి నుంచి డిమాండ్ లో ఉన్న తిరుపతి - ముంబాయి విమాన సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించింది. అదే విధంగా మరో సర్వీసును రాజమండ్రి - ముంబాయి మధ్య అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ రెండు విమానాల టైమింగ్స్ ను అధికారులు వెల్లడించారు. దీంతో, తిరుపతికి వచ్చే భక్తులకు వెసులుబాటు కలగనుంది.
రెండు కొత్త సర్వీసులు
దేశ ఆర్దిక రాజధాని ముంబాయికి ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల నుంచి నేరుగా వెళ్లేలా రెండు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయు డు ప్రకటన చేసారు. విస్తరిస్తున్న విమానయాన రంగం.. ఏపీ ప్రజల సౌకర్యార్ధం కొత్తగా రెండు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. తిరుమలకు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తుల కోసం ఇండిగో సంస్థ కొత్త సర్వీసును ప్రారంభించింది. అదే విధంగా రాజమండ్రి నుంచి ముంబాయికి మరో సర్వీసును ప్రారంభించినట్లు వెల్లడించారు.

టైమింగ్స్ ఇలా
ముంబై మీదుగా విదేశాలకు వెళ్లే ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు, తిరుమల బాలాజీ ఆలయానికి చేరుకునే భక్తులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని వివరించారు. రాజమండ్రి - ముంబాయి - రాజమండ్రి(6E 582/3), తిరుపతి - ముంబై - తిరుపతి(6E 532/3) మధ్య కొత్తగా ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫ్లైట్ నంబర్ 6E532 ముంబై నుండి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి 7:15 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుండి ముంబైకి వెళ్లే ఫ్లైట్ నంబర్ 6E533 ఉదయం 7:45 గంటలకు బయలుదేరి 9:25 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. ఈ సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయని ఇండిగో సంస్థ వెల్లడించింది.
చిరకాల డిమాండ్
తిరుపతి నుంచి ముంబాయికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. మహారాష్ట్రతో పాటుగా ఇతర దేశాల నుంచి ముంబై మీదుగా తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని గతంలోనే పలు మార్లు కేంద్రానికి వినతులు అందాయి. ఇప్పుడు ఈ మేరకు ఇండిగో సంస్థ ఈ రూట్ లో కొత్తగా సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీసు కు వచ్చే ఆదరణ.. ఆక్యుపెన్సీ చూసిన తరువాత ఇతర విమానయాన సంస్థలు తమ సర్వీసుల ప్రారంభం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications