
రాజధాని అమరావతి ఉద్యమంలో కోవర్టులు??
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 921వ రోజుకు చేరుకుంది. తమకు న్యాయం చేయగలిగేది హైకోర్టు ఒక్కటే అనే అభిప్రాయంలో అన్నదాతలున్నారు. ఆరునెలల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి, రైతుల ప్లాట్లు అభివృద్ధిచేసి అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అంత తక్కువ సమయంలో అభివృద్ధి చేయడం కుదరదని, మరింత సమయం కావాలంటూ ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ అన్నదాతలు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

స్థానికులు కానివారంతా ఉద్యమ నాయకులయ్యారు!!
అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఉద్యమం తీరు ఇలా జరుగుతుండగా తమ ఉద్యమంలో ఎంతోమంది కోవర్టులున్నారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఇళ్లు కానీ, భూములు కానీ లేనివారంతా ఉద్యమ నాయకులుగా చెలామణి అవుతున్నారని, ప్రతి టీవీల్లో చర్చావేదికల్లో పాల్గొంటున్నారని, వారి సొంత అభిప్రాయాలను రైతుల అభిప్రాయాలుగా మలచుతున్నారంటూ ఆవేదన చెందుతున్నారు.
ఒకరితో సంబంధం లేకుండా తమ ఉద్యమాన్ని కూడా తమను చేసుకోనివ్వడంలేదంటూ వాపోతున్నారు. ఉద్యమం పేరుతో ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చాయని, ఎందరో నాయకులుగా చెలామణి అవుతున్నారని, తమకు మాత్రం న్యాయం జరగడంలేదన్నారు.

వస్తున్నారు.. వెళుతున్నారు.. అంతే!!
రైతుల శిబిరాలకు ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తున్నారు.. మద్దతు ప్రకటించి వెళుతున్నారు.. ఫొటోలు దిగుతున్నారని.. తర్వాతరోజు మీడియాలో అవి ప్రచురితమవుతున్నాయని, అంతటితో వారి లక్ష్యం నెరవేరుతుందని, తాము మాత్రం 921 రోజులుగా శిబిరాల్లోనే కూర్చున్నామన్నారు. తాము ఏ ప్రణాళిక రచించుకున్నప్పటికీ అవతలి పక్షానికి తెలిసిపోతోందని, దీంతో తమ ఉద్యమం నీరుగారిపోతోందంటున్నారు.
అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున సాగే సమయంలో ఒక్కసారిగా నిప్పు మీద నీళ్లు చల్లినట్లుగా చప్పబడిపోతోందని మహిళా రైతులు చెబుతున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం జరిగిన తర్వాత నాయకులుగా చెలామణి అవుతున్నవారంతా ఇప్పటివరకు మరే కార్యక్రమానికి రూపకల్పన చేయలేదని, ఏ ఉద్యమమైనా విజయవంతం కావాలంటే కోవర్టులను గుర్తించగలిగితేనే సాధ్యమవుతుందంటున్నారు.

ఎవరిని నమ్మాలో అర్థం కావడంలేదే?
ముందుగా తమ ఉద్యమంలో ఉన్న కోవర్టులను తెలుసుకోలేకపోతున్నామని, వీరు సమాచారం అవతలి పక్షానికి అందిస్తున్నారని, తమలో తామే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ వాపోతున్నారు. రాజధాని నిర్మాణం కోసం పట్టుదలగా శిబిరాల్లో కూర్చోవడమేకానీ తమ ఉద్యమానికి సరైన దిక్సూచీ లేదని, నావను నడిపే సరంగు లేడంటున్నారు.
మహిళలమైనప్పటికీ పట్టుదల ప్రదర్శించాం కాబట్టి ఇన్నిరోజులుగానైనా శిబిరాలు నడుస్తున్నాయన్నారు. తమ శిబిరాల్లో, తమ గ్రామాల్లోనే కోవర్టులవల్ల ఉద్యమం నీరుగారిపోతోందని, దీనికి విరుగుడుగా బయట వ్యక్తులతో సంబంధం లేకుండా తామే సొంతంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నామని, త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు.