వైసీపీ నుంచి రాజ్యసభకు సుప్రీం మాజీ న్యాయమూర్తి - రేసులో ఆ ముగ్గురు..!?
ఏపీలో ఎన్నికల రాజకీయంగా హీటెక్కుతోంది. ఎన్నికల వేళ అభ్యర్ధుల ఎంపికపైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో సీట్లు దక్కే అవకాశం లేని వారి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సీట్ల ఎంపిక పైన కసరత్తు మొదలైంది. ఈ సారి జాబితాలో అనూహ్య రీతిలో ఎంపిక జరగనుంది. ఈ రేసులో కీలక వ్యక్తులు ఉన్నారని సమాచారం.
రాజ్యసభ రేసులో: ఏపీ నుంచి రాజ్యసభ కోసం అధికార వైసీపీలో చర్చ మొదలైంది. ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, బీజేపీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో, వైసీపీ నుంచి ఈ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది.

రాజ్యసభకు ఇప్పటి వరకు సీఎం జగన్ పూర్తిగా సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల వేళ కావటంతో కొత్తగా ఛాన్స్ ఎవరికి ఇస్తారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇందులో పార్టీలో ముఖ్యులతో పాటుగా సుప్రీం మాజీ న్యాయమూర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పదవీ విరమణ చేసే సభ్యుల్లో ఒకరైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభకు పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.
సుబ్బారెడ్డికి ఖాయమా: టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పని చేసి ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు చూస్తున్న వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు సమాచారం. 2019 కల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు.
వైఎస్సార్ కు సన్నిహితుడైన పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా పేరు వైసీపీ నేతల మధ్య రాజ్యసభకు పంపుతారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఆయన వైసీపీలో చేరుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో సజ్జల పేరు రేసులో వినిపిస్తోంది. అయితే, ఎన్నికలు- పార్టీ, ప్రభుత్వ నిర్వహణలో కీలకంగా ఉన్న సజ్జల ను ఢిల్లీకి పంపుతారా అనేది మరో చర్చ.

సుప్రీం మాజీ న్యాయమూర్తి పేరు పైనా: ఇక, రాజ్యసభకు పంపే జాబితాలో అనూహ్యంగా సుప్రీం మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేరు పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కృష్ణా జిల్లా కి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చారని ముఖ్య నేతల సమాచారం. న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీ అవుతుండటంతో...పెద్దల సభకు సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అందునా సరిగ్గా ఎన్నికల సమయంలో చేసే భర్తీ కావటంతో అనూహ్య ఎంపిక ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications