తిరుమల అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ ఈఓ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో.. : వసతి గదులపై
Tirumala: శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సమీపించిన నేపథ్యంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. తిరుమలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ ను సందర్శించారు. వంటగదిని స్వయంగా పరిశీలించారు. అన్నప్రసాదంలో వినియోగించే ఆహార వస్తువుల నాణ్యతను పరిశీలించారు. శ్రీవారి భక్తులతో నేరుగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్న ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్స్‌లను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్న ప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ అన్నారు.

1985లో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం 1994లో ట్రస్టుగా ఏర్పడిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రతి ఏటా విరాళాలు పెరుగుతున్నాయని, కార్పస్ నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 2023-24లో కార్పస్ రూ.1854 కోట్లు, 2024-25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2263 కోట్లకు చేరిందని వివరించారు.
వడ్డీలు రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగిందని, ప్రస్తుతం వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉందని తెలిపారు. రూ.కోటి విరాళదారులు కూడా పెరిగారని, 2023-24లో 14 మంది ఉంటే, 2024-25లో 25 మంది, ఈ సంవత్సరం ఐదు నెలల్లోనే 14 మంది రూ.కోటి పైగా విరాళం అందజేశారని చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా టీటీడీ భక్తులకు అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందుతున్నాయని అన్నారు.
మరోవంక- రిసెప్షన్ విభాగంపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వీఐపీలకు వసతి సౌకర్యంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రిసెప్షన్, ప్రోటోకాల్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు.
విశ్రాంతి గృహాలను పరిశీలించి ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని, ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అంతకు ముందు ఆయన అన్న ప్రసాద విభాగ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీవీఎస్వో మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్, వీజీవో సురేంద్ర, ఓఎస్డీ సత్రా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications